బీవీఆర్ఐటీ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్ ఆఫర్.. 52 లక్షల ప్యాకేజీతో
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో సీఎస్సీ ఇంజినీరింగ్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీలో నిర్వహించిన ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఏకంగా 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకొని లక్కీచాన్స్ కొట్టేసింది. సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన పుష్పలత, విష్ణువర్ధన్‌రెడ్డి దంపతుల కుమార్తె సంహిత మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎంపికయ్యింది. ఆమెకు ఏడాదికి రూ.52 లక్షల వేతనంతో ఉద్యోగం ఆఫర్ చేశారు. ప్లేస్మెంట్ ఇన్చార్జి బంగార్రాజు, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబే, కళాశాల చైర్మన్ విష్ణురాజు సంహితను అభినందించారు. తనకు ఈ ప్లేస్మెంట్ రావడానికి కారణం కళాశాలలో అందించిన శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని సంహిత తెలిపారు. ప్రొఫెసర్ పల్లవి, హెచ్‌వోడీ మధుబాబుతో పాటు కళాశాల యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






