Basara Temple: చాలా రోజుల తర్వాత బాసర దేవాలయ అభివృద్ధి… 225 కోట్లతో కార్యాచరణ
దేశంలోనే అత్యంత ప్రసిద్ధి దేవాలయం బాసర సరస్వతీ దేవాలయం. తమ పిల్లలకు చదువు రావాలని, మంచి విద్యా బుద్ధులు కలగాలని, తల్లిదండ్రులు సరస్వతీ దేవి పాదాల చెంత అక్షరాభ్యాసం చేయించుకుంటారు. అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వున్న సమయంలో బాసరను అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఆ సమయంలో బాసర పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత కొంత అభివృద్ధి ఆగిపోయింది. ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా బాసర సరస్వతీ దేవాలయం అంతగా అభివృద్ధి చెందలేదు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వేములవాడ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. కొన్ని కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని కూడా నిర్ణయించారు. దీని కోసం దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠాన్ని కూడా సంప్రదించారు. కానీ.. బాసర ఆలయం వైపు అంతగా శ్రద్ధ వహించలేదు.
అయితే.. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాసర పై శ్రద్ధ పెట్టింది. శనివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ బాసర ఆలయ అభివృద్ధి విషయంలో అధికారులతో సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ అధికారులతో సమావేశమై, చర్చించారు. అయితే అభివృద్ధి అనేది భక్తుల విశ్వాసాలను, ఆగమ శాస్త్రం ప్రకారమే వుండాలని, అలాగే భవిష్యత్తు అవసరాలను, రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని వుండాలని నిక్కచ్చిగా చెప్పారు.
అయితే ఈ నెల 6 న బాసర సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. 225 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులకు శంకు స్థాపన కూడా చేయనున్నారు. ఇందులో భాగంగా భక్తుల రద్దీని తట్టుకునేలా, పెద్ద పెద్ద రోడ్లను వేయనున్నారు. అలాగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేవలం ఈవీ వాహనాలను మాత్రమే వాడాలని నిబంధనలను తీసుకురానున్నారు.
టీటీడీ లాగే ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నియంత్రించనున్నారు కూడా. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















