సీతారాం ఏచూరికి కాంగ్రెస్ చేయూత?
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వంపై పోరాటానికి ప్రతిపక్షాలను ఏకతాటిపై నడిపించగలిగే వ్యక్తిగా సీతారం ఏచూరి గుర్తింపు పొందారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ ఏకమవ్వాల్సిన తరుణలో పార్లమెంటులో ఏచూరి ఉండటం అవసరమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరొక పర్యాయం రాజ్యసభకు ఎంపిక కావడానికి కాంగ్రెస్ పార్టీ తన సహకారాన్ని అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పశ్చిమ బెంగాల్ శాసనసభలో సిపిఎం ఎమ్మెల్యేలు 26 మంది మాత్రమే ఉన్నారు. దీనితో సీతారం ఏచూరి రాజ్యసభకు ఎంపిక కావడం కష్టం. అయితే కాంగ్రెస్ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కూడా సీతారాం ఏచూరికి మద్దతు ఇస్తే ఆయన రాజ్యసభకు సునాయాసంగా ఎంపిక అవుతారు.






