గంట విమాన ప్రయాణానికి రూ.2,500
ఉడాన్ సర్వీస్‌లో రూ.2,500 ఖర్చుతో గంటలోపు ప్రయాణం చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని మోడీ ప్రారంభించారు. హిమచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సిమ్లా-ఢిల్లీ మార్గంలో నడిచే తొలి ప్రాంతీయ విమాన సేవలను మోడీ జెండావూపి ప్రారంభించారు. దీంతో పాటు కడప- హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్‌కు విమాన సేవలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తేవటమే ఉడాన్ లక్ష్యమని అన్నారు. మధ్య తరగతి ప్రజల అభిలాష తీర్చేందుకు ఉడాన్ విమాన సేవలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మధ్య తరగతి ప్రజలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. దేశంలో చిన్న మధ్య తరహా విమానాశ్రయాల అనుసంధానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.













