Sharmila: కుటుంబ రాజకీయాల పై షర్మిల ఆవేదన..
వైఎస్ షర్మిల (YS Sharmila) ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అన్న జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చేతిలో తాను ఎదుర్కొన్న అనుభవాలు, తెలంగాణలో కవిత (Kavitha) కు వచ్చిన సమస్యలు కొంతవరకు ఒకేలా ఉన్నాయని ఆమె సూచించారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎన్నికల్లో BRS ఓటమిపై కవిత చేసిన వ్యాఖ్యలతో అక్కడ హీట్ పెరిగిన సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) షర్మిల-జగన్ తగాదాలు కూడా మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయవాడ (Vijayawada)లో మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ షర్మిల తమ కుటుంబంలో జరిగిన విషయాలను మళ్లీ బయటపెట్టారు.
అన్నగా జగన్ ఒకే ఒక్క చెల్లిని చూసుకునే బాధ్యత కూడా తీసుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆయనకు దూరం కాలేదని, కానీ జగన్, తల్లి విజయమ్మ (Vijayamma) ను కూడ తన దగ్గర నుంచి దూరం చేసినట్టుగా ఆరోపించారు. “అన్న అడిగిన వెంటనే వందల కిలోమీటర్లు నడిచానని, ఆయన కోసం చేసిన పాదయాత్ర (Padayatra) తన నిజమైన విశ్వాసానికి నిదర్శనమని” ఆమె గుర్తుచేశారు.
2014లో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేసి పార్టీకి బలం ఇచ్చిన తర్వాత, 2019లో వైసీపీ (YSRCP) అధికారంలోకి వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోయాయని షర్మిల చెప్పారు. విజయమ్మను గౌరవాధ్యక్షురాలిగా ఉన్న పదవి నుంచి తొలగించడాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. ఈ నిర్ణయాల తర్వాతే జగన్ పై తన అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.
ఇక్కడ అన్ని వదులుకొని తెలంగాణ లో తాను రాజకీయాలు ప్రారంభించాలనుకున్న సమయంలో, జగన్ ఆధ్వర్యంలోని పత్రిక తనను లక్ష్యంగా చేసుకుని ప్రతికూల వార్తలు రాసిందని షర్మిల ఆరోపించారు. దీంతో ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు వచ్చాయని, తన పార్టీని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. “నేను పార్టీ పెట్టుకున్నా నీకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ఎందుకు ఇలా చేశావు?” అని జగన్‌ను ప్రశ్నించినప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యానని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ (BRS) తో కలిసి తనను అరెస్ట్ చేయించారని కూడా షర్మిల ఆరోపించారు. అయినప్పటికీ, అన్నగా జగన్ తనను మరచిపోయినా, తాను మాత్రం సోదరిగా జగన్‌కు అండగా ఉంటానని అన్నారు. నిజమైన విశ్వాసం మనసులో ఉండాలే తప్ప బలవంతంగా చూపించలేమని ఆమె వ్యాఖ్యానించారు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసని, ఆ సమయంలో తానే ముందుకు వచ్చి పాదయాత్ర చేయడం ద్వారా వైసీపీని నిలబెట్టానని షర్మిల గుర్తుచేశారు. మహిళగా అనేక కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని ఆమె తెలిపారు. ఆస్తుల వివాదం తన వల్ల మొదలైనదేమీ కాదని, కొన్ని విషయాలపై మౌనం పాటించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి షర్మిల మాటను ముగించారు. ఆమె ఆవేదనలో ఇంకా పాత బాధలు తగ్గలేదన్న భావన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.






