YS Jagan: ఆరేళ్ల తర్వాత రేపు కోర్టు ముందుకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణలో రేపు కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. విచారణలో భాగంగా ఆయన రేపు హైదరాబాద్లోని (Hyderabad) సీబీఐ (CBI) ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఆరేళ్ల తర్వాత జగన్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు. జగన్ దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ను న్యాయస్థానం ఇటీవల తిరస్కరించడంతో ఆయన ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు విచారణలో ఇది ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉండడంతో తను నేరుగా హాజరు కావడం వల్ల అనేక వ్యయ ప్రయాసలు, భారీ భద్రతా ఏర్పాట్లు అవసరమవుతాయని కోర్టుకు చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన కోర్టుకు విన్నవించారు. దీంతో ఆయన విజ్ఞప్తిని మన్నించి ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇప్పుడు జగన్ ఓడిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించలేదు. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతుల ప్రకారం, నిందితుడు తప్పనిసరిగా విచారణకు సహకరించాలని, వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ హోదా, లేదా ప్రజా జీవితంలో ఉన్నందున ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడానికి చట్టం అంగీకరించదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే, కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 21లోపు హాజరు కావాల్సిన జగన్, ఒక రోజు ముందే నవంబర్ 20న కోర్టు ముందు నిలబడనున్నారు.
జగన్పై నమోదైన అక్రమాస్తుల కేసు ప్రధానంగా క్విడ్ ప్రో కో (Quid Pro Quo) పై ఆధారపడి ఉంది. జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వివిధ కంపెనీలకు అక్రమంగా కేటాయింపులు, అనుమతులు ఇవ్వగా, అందుకు ప్రతిగా ఆ కంపెనీలు వైఎస్ జగన్ స్థాపించిన కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టాయనేది ఆరోపణ. ఈ అంశంపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2012 మేలో జగన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన దాదాపు 16 నెలలు జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబరులో ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు సమయంలో న్యాయస్థానం విధించిన ప్రధాన షరతులలో ఒకటి – విచారణకు సహకరించడం, కోర్టు ఆదేశించినప్పుడు తప్పనిసరిగా హాజరు కావడం. బెయిల్ మంజూరైనప్పటి నుంచి ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ పలుమార్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. కానీ, తాజా పరిణామాలతో ఆయన రేపు హాజరు కావడం తప్పనిసరి అయ్యింది.
ఆంధ్రప్రదేశ్లో ఈ కేసు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ రేపటి హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ కేసుపై విచారణ సక్రమంగా జరగట్లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఈ కేసు విచారణ మళ్లీ కాస్త గాడిన పడినట్లు అధికార పక్షాలు భావిస్తున్నాయి. నిందితుడు వ్యక్తిగతంగా హాజరైతే, సాక్షుల విచారణ, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు వేగవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసు విచారణలో ఇది కొత్త వేగాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు జగన్ కోర్టుకు హాజరైన తర్వాత, తదుపరి విచారణ తేదీ, వ్యక్తిగత హాజరు విషయంలో కోర్టు వైఖరిని బట్టి ఈ కేసు భవిష్యత్తు తేలనుంది. రేపటి హాజరు కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై కూడా ప్రభావాన్ని చూపనున్న ఒక ముఖ్య పరిణామంగా చూడవచ్చు.






