YCP: భువనేశ్వరి పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం..అసలు నిజం ఏమిటి?
ఇప్పుడు రాజకీయాల్లో ఏది జరిగినా, దానికి మనం ఎలా అర్థం చేసుకుంటామన్నది చాలా కీలకం. మనసు మంచిగా ఉంటే ప్రతిదాంట్లో మంచే కనిపిస్తుంది అదే మనసు చెడుగా ఉంటే చేసిన మంచిలో కూడా చెడ్డ తప్ప మరేమీ కనపడదు. ఇంత జరిగినా ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) మాత్రం విషయాల్ని వక్రీకరించే అలవాటు మార్చుకోలేదు అనిపిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కూడా సోషల్ మీడియా ప్రభావం, ఐప్యాక్ వ్యూహాల్లో చిక్కుకుపోయినట్లుగానే కనిపిస్తున్నారు.
అక్రమ కేసుతో జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan)ను జగన్ పరామర్శించినప్పుడు, అక్కడ ఓ చిన్నారి “జగన్ మామయ్య” అని ఏడుస్తున్న వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ ఆ మరుసటి రోజుకే అది అసలు నిజం కాదని, సోషల్ మీడియా కథనంగా తయారైనదని బయటపడింది. తమకు అనుకూలంగా కథల్ని సృష్టించుకోవడం ఒక పరిమితం వరకు ఉన్నా, రాజకీయ ప్రత్యర్థులను—అందులోనూ మహిళలను—తక్కువ చేసి చూపించడం మాత్రం మంచిది కాదు. ఇది సమాజానికి తప్పు సందేశం ఇస్తుంది.
ఇక తాజాగా జరిగిన సంఘటనతో వైసీపీ సోషల్ మీడియా మరింత దిగజారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) నియోజకవర్గం కుప్పం (Kuppam)లో ఆయన భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) రెండురోజులుగా పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి, పాఠశాలలను పరిశీలిస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పిల్లలు నేలపై కూర్చొని తింటుండటం వల్ల, ఆమె వయసును గౌరవించి అధికారులు చిన్న స్టూల్ పెట్టారు.
ఆమె కూడా మర్యాదపూర్వకంగా తన చెప్పులను తానే విప్పి స్టూల్ కింద పెట్టారు. ఎవరి చేతికి ఇవ్వలేదు, అవి ఎవరికీ తగలలేదు. పైగా పద్ధతి కోసం తన చీర కొంగుతో అవి బయట కనిపించకుండా చూసుకున్నారు. పెద్దవాళ్లు సాధారణంగా చేసే జాగ్రత్త ఇదే. కానీ దీనికే అసభ్యత అనే ముద్ర వేసి వైసీపీ సోషల్ మీడియా దాన్ని పెద్ద దుమారం చేసిన తీరు ఆశ్చర్యంగా ఉంది. పిల్లల భోజనం చేసే దగ్గర చెప్పులు పెట్టారు అంటూ వార్తలుగా మార్చడం అత్యంత నీచమైన పని కాక మరేమిటి?
అదే సమయంలో కేరళ (Kerala)లోని శబరిమలై (Sabarimala)లో కొందరు భక్తులు “జై జగన్” నినాదాలు పెట్టినప్పుడు, జగన్ ఫ్లెక్సీలు పట్టుకొని తిరిగినప్పుడు, వైసీపీ సోషల్ మీడియాకు మాత్రం అది కనిపించలేదు. ఆ సమయంలో మాత్రం అది తప్పుగా అనిపించలేదు. అయ్యప్ప స్వామి దీవక్షలో రాజకీయాల్ని తెస్తే అది సరైందని భావించిన వారికి ఈ పని మాత్రం పెద్ద సమస్యలా చూపించడం వారి ద్వంద్వ స్వభావాన్ని బయటపెడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది. రాజకీయ విభేదాలు ఏవైనా సరే, వ్యక్తిగతంగా మహిళలపై దాడి చేయడం, వారి నడవడికను అసభ్యంగా చూపడం సరైన మార్గం కాదు. ఇటువంటి విషయాల్లో సంయమనం అవసరం.






