CII Partnership Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌పై వైసీపీ నిశ్శబ్దం.. రీసన్ ఏమిటో?
విశాఖపట్నం (Visakhapatnam) లో జరిగిన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు (investor summit) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కొత్త చర్చలకు దారితీసింది. సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే పారిశ్రామిక వేత్తలు పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకోవడం, వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు సాగడం, భారీ పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం ప్రకటించడం పాలకపక్షానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ ఈవెంట్ విజయవంతంగా ముగిసిందని ప్రభుత్వం ప్రకటించిన సమయంలో, విపక్షం వైసీపీ (YSRCP) మాత్రం ఆశ్చర్యకరమైన నిశ్శబ్దాన్ని పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కూటమి (NDA Alliance) , వైసీపీ మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైనప్పటికీ, పార్టీ కేడర్ ,సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం పై నిరంతరం ఒత్తిడి పెంచుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలలో లోపాలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతో పెద్ద ఈవెంట్ అయిన సీఐఐ సదస్సుపై (CII Partnership Summit) వారు మౌనం పాటించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరచింది.
సదస్సు మీద వైసీపీ స్పందన కోసం అనేక వర్గాలు ఎదురు చూశాయి. కానీ పార్టీ అనుకూల యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా పేజీల్లో కూడా ఈ కార్యక్రమంపై పెద్ద చర్చ కనిపించలేదు. బదులుగా పరకామణి చోరీ (Parakamani theft case) కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ (Satish Kumar) మరణం, హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో సీఐఐ సదస్సు పూర్తిగా పక్కకు నెట్టబడింది.
ఈసారి సదస్సు నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు (N. Chandrababu Naidu) ముందుగా అప్రమత్తంగా ఉండటం, లోపాలు కనిపించకుండా అన్ని ఏర్పాట్లను కఠినంగా పర్యవేక్షించడం వల్ల విపక్షానికి విమర్శించే అవకాశం లభించలేదని అందరూ భావిస్తున్నారు. 2023లో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit) సమయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తగా ఉండిందని అంటున్నారు.
ఇక వైసీపీ ఎందుకు మౌనం పాటించిందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోయినా, రాజకీయ వర్గాల్లో రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక అభిప్రాయం ప్రకారం వైసీపీకి ఈ ఈవెంట్లో విమర్శించే అంశం దొరికి ఉండకపోవచ్చు..లేదా పార్టీ ప్రస్తుతం ఇతర రాజకీయ విషయాలను ప్రధానంగా తీసుకుని వాటిపైనే దృష్టి పెట్టి అవసరం లేదని భావించిఉండవచ్చు. మొత్తానికి, విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ప్రభుత్వం-విపక్షాల మధ్య కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసినట్టు కనిపిస్తోంది.






