అమెరికా వీసా రద్దుతో వైద్యురాలి బలవన్మరణం
అమెరికా వీసా (Visa) రద్దు కావడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్మ చేసుకున్న ఉదంతమిది. గుంటూరుకు చెందిన కాకు రోహిణి (Rohini) (38) కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ చేసి మూడేళ్ల కిందట హెచ్1బీ వీసా (H1B visa) పై అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగానికి ప్రయత్నించే క్రమంలో అందుకు సంబంధించిన మూడు దశల పరీక్షల్లో మంచి మార్కులు సాధించారు. అబ్జర్వర్షిప్ మూడు సార్లు చేశారు. రెసిడెన్సీ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యారు. కుటుంబసభ్యులను చూసేందుకని గత మేలో భారత్‌కు వచ్చారు. ఇంతలో అమెరికా వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేశారు. రోహిని హెచ్1బీ వీసాను జే1 వీసాగా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే తిరస్కరించారు.
దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈ నెల 22న హైదరాబాద్‌లోని నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. రోహిణి మృతదేహం ఆదివారం గుంటూరులోని నివాసానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తన బిడ్డ ఎంతో ధైర్యవంతురాలని, తమను ఎంతో ప్రేమగా చూసుకునేదని, అందరికీ సహాయం చేయాలని తపన పడేదని రోహిణి తల్లి డాక్టర్ లక్ష్మీరాజ్యం కన్నీటి పర్వంతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలతో మనస్తాపం చెందిన తన సోదరి బలవన్మరణానికి ఒడిగట్టిందని విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుజన్‌బాబు వాపోయారు. రోహిణి అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి.






