Vijay Sai Reddy: పెట్టుబడుల పురోగతిపై విజయసాయిరెడ్డి స్పందన..
వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజకీయ ప్రయాణం ఇంతకుముందు సోషల్ మీడియాలో ఎంత ఉత్సాహంగా సాగిందో అందరికీ తెలిసిందే. ట్విట్టర్ (Twitter) లో ఆయన చూపిన దూకుడు అప్పట్లో రాజకీయ చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ,తెలుగు దేశం పార్టీ (TDP) పై ఆయన చేసిన వరుస ట్వీట్లు ఒకప్పుడు వైసీపీ (YCP) కార్యకర్తలకు బలం కలిగించేవి. రోజుకు పలు వ్యాఖ్యలతో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ ఆయన రచ్చ రేపిన రోజులు అన్నీ ఇప్పుడు కేవలం గతం మాత్రమే అయ్యాయి. రాజకీయాల్లో వర్తమానమే ముఖ్యం కాబట్టి, ఇప్పుడు సాయిరెడ్డి ఎటువంటి పాత్రలో ఉన్నారు అన్నది కొత్త చర్చగా మారింది.
ఈ ఏడాది జనవరి 25న ఆయన వైసీపీకి అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభ (Rajya Sabha) స్థానాన్ని కూడా విడిచిపెట్టారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తదుపరి అడుగు ఏదన్నదానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ప్రత్యేకంగా ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరతారని, తిరిగి పార్లమెంటులోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం సాగింది. కానీ ఇవేవీ నిజం కాలేదు. ఒకప్పుడు ట్విట్టర్లో చురుకుగా కనిపించిన ఆయన కార్యకలాపాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇటీవల ఆయన తిరిగి వైసీపీలో చేరే అవకాశంపై కూడా వార్తలు వచ్చినప్పటికీ, జగన్ (Jagan ) అంగీకారం లేదన్న సమాచారంతో ఆ ప్రచారం కూడా కాస్త సద్దుమణిగింది. అందుకే ప్రస్తుతం ఆయన రాజకీయంగా తటస్థంగా ఉన్నారు అని చెప్పాలి.
ఇటీవల విశాఖపట్నంలో (Visakhapatnam) జరిగిన ఇన్వెస్టర్ల సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరిన విషయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే అయింది. తెలుగుదేశం పార్టీ ఈ విజయాన్ని ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు నిజంగా గ్రౌండ్లో అమలు కావాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధికారి ని నియమించి ప్రతి ఒప్పంద పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా, రియల్-టైమ్ వెబ్సైట్ సృష్టించి 613 పెట్టుబడి ఒప్పందాలు ఏ దశలో ఉన్నాయో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
పెట్టుబడులలో కనీసం 75 శాతం అయినా అమలులోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ఆయన అభిప్రాయం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక కార్యక్రమాలపై ఆయన చూపిన సానుకూల దృక్కోణాన్ని స్పష్టంగా తెలిపాయి. ఒకప్పుడు వైసీపీకి మద్దతుగా నిలిచిన సాయిరెడ్డి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనులను ఆమోదించేలా మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది.






