Vijayasai Reddy: జనసేనలోకి విజయసాయి రెడ్డి..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) అనూహ్య పరిణామాలకు తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ఒకప్పుడు నంబర్ 2గా, జగన్ నీడగా, పార్టీ ప్రధాన వ్యూహకర్తగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి (Vijayasari Reddy).. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం మౌనంగా ఉండి, తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఆయన చూపు జనసేన (Janasena) వైపు ఉందన్న ప్రచారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
ఎన్నికల ఓటమి తర్వాత విజయసాయి రెడ్డి వైసీపీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపుతానని ప్రకటించారు. కానీ, రాజకీయం అనేది ఒక వ్యసనం లాంటిదని, అందులో ఒకసారి రుచి చూసిన వారు అంత తేలికగా బయటకు రాలేరని విశ్లేషకులు అంటూ ఉంటారు. దాన్ని నిజం చేస్తూ, విజయసాయి రెడ్డి తాజాగా.. “అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను” అని ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆ ‘అవసరం’ ఎవరికి? ఆయనకా లేక ఆయనను కోరుకుంటున్న పార్టీకా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
వాస్తవానికి విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఢిల్లీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఆయనకున్న నెట్వర్క్ బీజేపీకి ఉపయోగపడుతుందని భావించారు. కానీ, ఏమైందో ఏమో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. బీజేపీలో చేరిక అంశం మరుగున పడిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే తెరపైకి జనసేన పేరు వచ్చింది.
విజయసాయి రెడ్డి జనసేనలో చేరబోతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగే విజయసాయి రెడ్డి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విషయం వచ్చేసరికి ఆచితూచి స్పందించేవారు. తాజాగా ఆయన.. నేను ఎప్పుడూ పవన్ కల్యాణ్ ను విమర్శించలేదు, భవిష్యత్తులోనూ విమర్శించను అని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉన్న పార్టీల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చాలా అరుదు. పవన్ పై ఆయన చూపిస్తున్న ఈ సాఫ్ట్ కార్నర్, జనసేన వైపు ఆయన వేస్తున్న అడుగుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పరోక్షంగా పవన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఈ వ్యాఖ్యలు పంపిస్తున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం పరంగా ఇంకా బలపడాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉన్నా, పార్టీని నడిపించే సీనియర్ నేతలు, వ్యూహకర్తల కొరత ఆ పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి లాంటి సీనియర్, అనుభవజ్ఞుడైన నేత పార్టీలోకి వస్తే.. అది జనసేనకు అదనపు బలం అవుతుందనే విశ్లేషణలు ఉన్నాయి. విజయసాయి రెడ్డికి ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో, ఢిల్లీ లాబీయింగ్ లో, ఎన్నికల వ్యూహరచనలో అపారమైన అనుభవం ఉంది. ఇలాంటి ‘ట్రబుల్ షూటర్’ అవసరం ప్రస్తుతం ఎదుగుతున్న జనసేనకు ఎంతైనా ఉంది. పవన్ కల్యాణ్ కూడా అనుభవం ఉన్న నేతలను కలుపుకుపోయే ధోరణిలో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
మరోవైపు, విజయసాయి రెడ్డి ఏ పార్టీలో చేరినా.. అది వైసీపీకి మాత్రం తీరని లోటే అవుతుంది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటి ఉన్న వ్యక్తి ఇలా పక్క చూపులు చూడటం వైసీపీ క్యాడర్ ను నైతికంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికే అనేక మంది నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో, విజయసాయి రెడ్డి వంటి అగ్రనేత జనసేన గూటికి చేరితే.. అది వైసీపీ పతనానికి మరో సంకేతంగా మారుతుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదు. విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు, పవన్ పై ప్రశంసలు, జనసేన అవసరాలు.. ఇవన్నీ ఒకే బిందువు వద్ద కలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి మెడలో జనసేన కండువా పడితే ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మరో ఆసక్తికర మార్పు చోటుచేసుకున్నట్టే.






