Vijay Sai Reddy: జగన్ కోటరీపై విజయసాయిరెడ్డి ఫైర్… కొత్త పార్టీ సంకేతాలా?
విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఇటీవల తన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్(AP) రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. ఆయనను ఇప్పడు కేవలం మాజీ ఎంపీగానో, మాజీ వైసీపీ నేతగానో కాదు… రాజకీయాల నుంచి పక్కకు తప్పుకుని రైతుగా జీవిస్తున్న వ్యక్తిగానే చూడాలని ఆయన స్వయంగా చెప్పినా, ప్రజలు ఆయన మాటల్లో పొలిటికల్ కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన కార్యక్రమానికి ఆదివారం హాజరైన ఆయన, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ,ఆయన చుట్టూ ఉన్న కోటరీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ చుట్టూ ఉన్న కొందరు అతని తప్పుదారి పట్టిస్తున్నారని, ఆయన వినాల్సిన మాటలను వినకుండా చేస్తూ దారి మళ్లిస్తున్నారని విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన విషయానికి వస్తే, జగన్కు చేరే సమాచారం పూర్తిగా వక్రీకరించబడుతోందని ఆయన ఆరోపించారు. జగన్ నిజమైన మాటలు వినాలి, నిర్ణయాలు స్వయంగా ఆలోచించి తీసుకోవాలి అనే సందేశాన్ని పరోక్షంగా అందించారు. ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా బహిరంగా సలహా ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాను ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీకీ చెందిన మనిషి కాదని, పూర్తిగా రైతుగానే జీవిస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదని, అయినా మాత్రం రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఎదురయ్యాయని ఆయన వివరించారు. అవసరం అనిపిస్తే తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడానికి వెనకాడనని చెప్పడం ఆయన వ్యాఖ్యల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదనే సంగతి చెప్పినా, భవిష్యత్తులో పరిస్థితులు బట్టి ముందుకు రావచ్చని స్పష్టంగా చెప్పారు.
రాష్ట్రంలో పలువురు మహానుభావుల పేర్లతో జిల్లాలు ఏర్పడ్డా, స్వాతంత్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి(Syeraa Narasimha Reddy) పేరు మాత్రం జిల్లాలకు ఇవ్వలేదని, ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి కావాల్సిన మొత్తం ఖర్చును తానే భరిస్తానని ప్రకటించి, అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు.
ఇక జనసేన (Janasena) అధినేత , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉందని, ఆయనపై ఏ రోజు విమర్శ చేయలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. తాను ఎవరి వ్యాఖ్యలను పట్టించుకోకుండా రైతుగా జీవిస్తున్నానని, కానీ అవసరం అయితే రాజకీయాల్లోకి మళ్లీ ప్రవేశించి పార్టీ స్థాపించడం కూడా తనకు కొత్త విషయం కాదని ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను మరింత ఊపిరి పీల్చేలా మారాయి.






