శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్ కలకలం..!
తిరుమల(Tirumala) శ్రీవెంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల వ్యవహారంలో ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. సామాన్య భక్తులకు అందాల్సిన టికెట్లను దళారులు అడ్డదారిలో కొట్టేస్తున్న వైనాన్ని టీటీడీ విజిలెన్స్ అధికారులు కనిపెట్టారు. చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ ఒకే ఫోన్ నెంబర్‌తో వందలాది టికెట్లను బుక్ చేసి భక్తులను దోచుకుంటున్నట్లు తేలింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ‘పద్మావతి ట్రావెల్స్’ అనే సంస్థపై టీటీడీ(TTD) విజిలెన్స్ కన్నేసింది. సాధారణంగా శ్రీవాణి(Srivani trust) టికెట్ల కోసం భక్తులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
కానీ, ఈ ఏజెన్సీ మాత్రం ఒకే మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి బల్క్ బుకింగ్స్ చేసినట్లు అధికారులు గుర్తించారు. టెక్నాలజీలో ఉన్న లొసుగులను వాడుకుని ఈ ఏజెన్సీ యథేచ్ఛగా టికెట్లను బ్లాక్ చేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10,000 విరాళం ఇస్తే ఒక వీఐపీ బ్రేక్ దర్శనం(Break Darshan) టికెట్.. రూ.500కు లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు ట్రావెల్ ఏజెన్సీ, ముందుగానే టికెట్లను బుక్ చేసేసి.. దర్శనం కోసం తహతహలాడే భక్తులకు ఒక్కో టికెట్‌ను బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది.
ట్రావెల్ ప్యాకేజీల పేరుతో భక్తుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిస్థాయిలో ఆరా తీస్తోంది. కేవలం ఈ ఒక్క ఏజెన్సీయేనా లేక ఇంకా ఇతర ఏజెన్సీలు కూడా ఈ దందాలో ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఐటీ విభాగం సహాయంతో సదరు ఏజెన్సీ వాడిన ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలను సేకరిస్తున్నారు. భక్తులు ఇటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని, అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి






