పదిహేనేళ్ళ శ్రీసిటీ ప్రగతి ప్రస్థానం
భారీ ఉపాధి, స్థిరమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ప్రయాణం
2008, ఆగస్టు 8న ప్రారంభించబడిన శ్రీసిటీ ఏకీకృత వ్యాపార నగరం (Integrated Business City), అనతి కాలంలోనే ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌళిక వసతులను ఏర్పరచుకుని, అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ, నేడు దేశంలోని వివిధ పారిశ్రామిక నగరాలలో అగ్రగణ్యంగా నిలిచింది. పదిహేనేళ్ళ ప్రగతి ప్రస్థానంలో, దాదాపు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు మరియు 1.1 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఎగుమతులతో, శ్రీసిటీ దినదినాభివృద్ధి చెందుతున్నది. వివిధ తయారీ రంగాలలో, 28 దేశాలకు చెందిన 45 బహుళ జాతి కంపెనీలతో సహా, మొత్తం 205కు పైగా ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలకు శ్రీసిటీ నిలయంగా మారింది. భారత ప్రభుత్వం ఆద్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు శ్రీసిటీ ఒక ప్రేరణ చిహ్నంగా మారింది. ఇక్కడ ఉన్న అనేక పారిశ్రామిక యూనిట్లు దిగుమతులకు ప్రత్యామ్నా యంగా, మరియు ఎగుమతులను గణనీయంగా పెంచే నాణ్యమైన వివిధ పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో, సుమారు 7,500 ఎకరాల విస్తీర్ణంలో శ్రీసిటీ విస్తరించి ఉన్నది. ఇందులో ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ), డొమెస్టిక్ టారిఫ్ జోన్ (DTZ), ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ (FTWZ) మరియు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) ఉన్నాయి. శ్రీసిటీ ప్రాంతాన్ని దేశంలోని ‘పది గొప్ప ఉత్పాదక ప్రదేశాలలో ఒకటిగా ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (IRS) 2.0 ప్రాతిపదికగా, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) దేశంలోని వివిధ ఇండస్ట్రియల్ పార్కులు మరియూ సెజ్జులలో శ్రీసిటీని ‘లీడర్స్’గా పరిగణిస్తున్నది. మరియూ, దక్షిణ భారతదేశంలో ఈ గుర్తింపును సాధించిన ఏకైక పారిశ్రామిక పార్కు శ్రీసిటీ.
శ్రీసిటీ స్థాపన, అభివృద్ధికి రవీంద్ర సన్నారెడ్డి అకుంఠిత దీక్ష, కృషి
ప్రస్తుతం శ్రీసిటీ నెలకొని ఉన్న, వరదాయపాళెం, సత్యవేడు మండలాలలోని ప్రాంతం పదిహేనేళ్ళ క్రితం ఆర్ధికంగా, సామాజికంగా రాష్ఠ్రంలోనే వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపబడిరది. ఉపాధి దొరకని ఆ ప్రాంత ప్రజానీకం పేదరికానికి ప్రతీకలు. అప్పుడు ఆప్రాంతం చూసినవారి మదిలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు, జీవనోత్సాహం లేని గ్రామస్తులు, వాన చినుకు కోసం ఆకాశం వైపు మోరలెత్తి ఎదురు చూస్తే రైతులు, వసతులులేని బడులలో చదువు సాగని పిల్లలు, ‘వ్యయ’సాయం తప్ప, వ్యవసాయానికి పనికిరాని భూములు… ఇవే దృశ్యాలు. కానీ ఇప్పుడో? అధునాతన ఫ్యాక్టరీ భవంతులు, సూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, శిక్షణా కేంద్రాలు, నున్నటి తారు రోడ్లు, కనువిందు చేసే పచ్చటి చెట్లు, వేల మంది యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు. పదిహేనేళ్ళ క్రితం ఈ ప్రాంతం చూచి, మరలా ఇప్పుడు చూస్తున్న వారికి ‘ఇది కలా, నిజమా!’ అన్న సందేహం రాక మానదు.
ఒక ఎడారిని నందనవనంగా మార్చాలంటే ఎంత కష్ట పడాలో, ఆ వెనుకబడిన ప్రాంతాన్ని, ప్రస్తుత శ్రీసిటీగా రూపాంతరం చెందించడానికి, అంత కంటే ఎక్కువ కష్ట పడ్డారు డా. రవీంద్ర సన్నారెడ్డి. మౌళిక వసతుల లేమి కారణంగా విదేశీ పారిశ్రామిక సంస్థలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టటానికి సుముఖత చూపటం లేదన్న విషయాన్ని గుర్తించి, చెన్నైకి సమీపంలో ఒక పారిశ్రామిక నగరాన్ని స్థాపించాలని రవీంద్ర నిర్ణయించారు. తద్వారా తాను పుట్టిన ప్రాంతానికి ఎంతో కొంత మేలు చేయాలన్న తపనతో, తన మిత్రుల సహకారంతో 2005లో శ్రీసిటీ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఈ ప్రాంతవాసిగా వ్యవసాయ గ్రామీణ నేపథ్యం నుండి అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో ‘మెగాసాఫ్ట్’ సంస్థను స్థాపించి, అసమానమైన వ్యాపార విజయాన్ని అందుకున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వ్యవస్థాపక కార్యనిర్వాహక సంచాల కులుగా శ్రీసిటీ స్థాపన, విస్తరణ మరియు విజయానికి చోదక శక్తిగా నిలిచారు.
అప్పటి ప్రభుత్వం అందించిన సహకారంతో సత్యవేడు, వరదాయపాళెం, తడ మండలాలలో సుమారు 7,500 ఎకరాల భూమిని మార్కెట్ రేటు కన్నా ఎక్కువ పరిహారం ఇచ్చి శ్రీసిటీ సేకరించింది. అనతికాలంలోనే, ఆ భూమిని అభివృద్ధి పరచి, అక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పారిశ్రామిక మౌళిక వసతులను ఏర్పరచారు. ప్రపంచవ్యాప్త పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు నమ్మకం కుదరటంతో, పలు సంస్థలు అక్కడికి రావడం ప్రారంభించాయి. పెప్సీ, క్యాడ్బరీ, కాల్గేట్ పామోలివ్, కెల్లోగ్స్, అల్ట్సం, కోబెల్కో, వెస్ట్ ఫార్మా, యూనిఛాం వంటి బహుళజాతి సంస్థలు తరలి వచ్చాయి. వచ్చినందుకు వారిలో ఎంత సంతృప్తి వుందో చెప్పడానికి, దాదాపుగా ప్రతి పారిశ్రామిక సంస్థ తమ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిం చే ప్రణాళికలు అమలు చేయడమే ఒక నిదర్శనం. పదిహేనేళ్ళల్లో శ్రీసిటీ పారిశ్రామిక నగరంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి ఈ స్థాయికి చేరింది.
శ్రీసిటీని ప్రస్తుత స్థాయికి తీసుకెళ్లడంలో గత పదిహేనేళ్లుగా విశిష్ఠ కృషి చేస్తున్న తమ బృందాన్ని కార్య నిర్వాహక సంచాలకులు డా. రవీంద్ర సన్నారెడ్డి అభినందిస్తూ, మెగా ఇండస్ట్రియల్ హబ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ పెట్టుబడిదారులకు అత్యంత సిఫార్సు చేయబడిన పెట్టుబడి గమ్యస్థానంగా ఆవిర్భవించిందని అన్నారు. స్థానిక తయారీని పెంచడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, రాష్ట్రం మరియు ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వేగవంతం అయితుందని ఆయన అన్నారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రస్తావిస్తూ, ‘‘పరిశ్రమల సంఖ్య మరియు ఉపాధి పొందుతున్న శ్రామిక శక్తి పరంగా మెచ్చుకోతగ్గ స్థాయికి చేరుకున్నందున, మేము ఇప్పుడు ప్రపంచ స్థాయి సామాజిక మౌళిక వసతుల నిర్మించడంపై దృష్టి పెడుతున్నాము, అలాగే ‘పనికి నడిచి వెళ్ళే’ పద్ధతిలో నివాస సముదాయాల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయి. నేడు, ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. 52,000 మందికి పైగా ప్రజలకు జీవనోపాధిని అందిస్తోంది, మరియు వారిలో సగానికి పైగా మహిళలు ఉన్నారని డా. రవీంద్ర చెప్పారు.
పెట్టుబడుల వెల్లువ, పారిశ్రామిక ప్రగతి
అచిరకాలంలో సాధించిన విజయాలే శ్రీసిటీకి పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువగా రావటానికి దోహద పడ్డాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, సౌరశక్తి, ఇంజనీరింగ్ పరికరాలు-విడిభాగాల ఉత్పత్తి, మెట్రో రైళ్ళు, కార్లు, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ, ఖనిజాలను వెలికి తీసే యంత్ర సామగ్రి, ఎయిర్ కడిషనర్లు, ఆహార శుద్ధి, పానీయాలు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ (ఎఫ్.ఎం.సి.హెచ్) వంటి వివిధ రంగాలలో బహుళ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ కేంద్రాలను నెలకొల్పటానికి శ్రీసిటీ ఎంతో అనువైనదిగా భావిస్తున్న అనేక దేశ, విదేశ సంస్థలు తమ భారి పెట్టుబడులకు శ్రీసిటీ తగిన ప్రాంతంగా గుర్తించి తమ కర్మాగారాలను స్థాపించాయి.
బహుళ ఉత్పత్తుల వ్యాపార నగరానికి సరైన ఉదాహరణ శ్రీసిటీ.
ప్రపంచ దేశాల కొరకు వివిధ రంగాలలో అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల ఉత్పత్తులు ఇక్కడ తయారైతున్నాయి. ఉదాహరణకు, కార్లు (ఇసుజు మోటార్స్), ఎక్స్‌కవేట ర్లు, క్రేన్లు (కోబెల్కో), మెట్రో కోచెస్, మెట్రో రైళ్లు (ఆల్స్టోమ్), ఆటోమొబైల్ విడిభాగాలు (ఎన్.ఎస్. ఇన్స్ట్రుమెంట్స్, నిట్టన్ వాల్వ్స్, ఎన్.హెచ్.కె స్ప్రింగ్స్, పియోలాక్స్, మిత్సుబిషి మెటల్ వన్, మొదలైనవి), నిర్మాణ పరికరాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు (యాస్ట్రోటెక్ స్టీల్స్, డేనియలి, వి.ఆర్.వి-చార్ట్, బెర్జెన్ పైప్ సపోర్ట్స్, రుద్ర మాగ్నెట్స్, ఐ.మా.ప్, జొనేజా బ్రైట్, కాన్సెప్ట్ పాలిప్రో, ఎం.ఎం.డి., పేక్స్, ప్రోటో-డి, రోటోలాక్, మొదలైనవి), ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ ఉత్పత్తులు (జడ్.టి.టి., సి.ఇ.టి.సి., పనసోనిక్, షాన్ సోలార్), స్మార్ట్ ఫోన్లు (ఫాక్స్‌కాన్‌కు చెందిన భారత్ ఎఫ్.ఐ.హెచ్), ఎయిర్ కండిషనర్లు డ చిల్లర్స్ (డైకిన్, బ్లూస్టార్, యాంబర్, హావెల్స్-లాయిడ్, ఈప్యాక్ డ్యూరబుల్, థర్మాక్స్), వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు (యూనిఛాం, కింబర్లీ క్లార్క్), చక్రాల కుర్చీలు, ఆస్పత్రి మంచాల అవంటి పునరావాస సంరక్షణ పరికరాలు (వెర్మీరియన్), చాక్లెట్లు (మాండెలెజ్-క్యాడ్బరీ), సాఫ్ట్ డ్రిరక్స్ (పెప్సికో), కార్న్ ఫ్లేక్స్ (కెల్లాగ్స్), కాఫీ (లావాజా), టీ (ఎవర్టన్ టీ), రుచులు- సువాసనలు (ఐ.ఎఫ్.ఎఫ్), గార్మెంట్స్ (ఎం.ఎస్.ఆర్ గార్మెంట్స్, కే.జి.ఐ క్లోతింగ్స్), ప్రత్యేక (పారిశ్రామిక) టెక్స్టైల్ (టోరే పరిశ్రమలు), బొమ్మలు (పాల్స్ ప్లష్), ఇంకా మరెన్నో. 2027 నాటికి భారతదేశంలో ఉత్పత్తయ్యే మొత్తం ఎయిర్ కండీషనర్లలలో, 50 శాతానికి పైగా శ్రీసిటీలోనే తయారౌతాయని అంచనా. శ్రీసిటీలోని తయారీదారు లు గణనీయమైన విజయాలతో ప్రత్యేకమైన రికార్డులను సృష్టించారు. ఉదాహరణకు, రోజుకు 2 మిలియన్ టూత్ బ్రష్‌లను తయారుచేసే సామర్ధ్యం ఉన్న కోల్గేట్ పామోలివ్ ప్లాంట్, దేశంలో తయారౌతున్న 40 శాతం టూత్‌బ్రష్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద మాండెలెజ్ ప్లాంట్, సెకనుకు 105 చాక్లెట్ బార్లను ఉత్పత్తి చేస్తుంది. నెలకు 260 మిలియన్ల డైపర్లను యూనిచార్మ్ ఉత్పత్తి చేస్తుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే!
* అనేక ఎఫ్.ఎం.సి.హెచ్, ఆహార, పానీయాలు, ఫార్ములేషన్స్, అపెరల్స్ మరియు వైట్ గుడ్ పరిశ్రమలు తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో స్థాపించినందువల్ల, ప్రధాన ప్యాకేజింగ్ మరియు థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3ూూ) సర్వీస్ కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటి ఉనికి శ్రీసిటీలో సహజీవన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
* శ్రీసిటీ యొక్క సుస్థిరత కార్యక్రమాలు సరైన దిశలో సాగుతూ, ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేసేందుకు నిబద్ధతను ప్రదర్శించటమే కాకుండా, దేశంలోని ఇతర పారిశ్రామిక పార్కులకు ఒక నమూనాగా పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమాలు కాలుష్య ప్రభావాన్ని తగ్గించటమే కాకుండా, పరిసర ప్రాంతంలో పర్యావరణ వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయి.
కార్పొరేట్ సామాజిక బాధ్యతకు పెద్దపీట
పరిసర ప్రాంతాల సామాజిక ఆర్థికాభివృద్ధిలో శ్రీసిటీ పాత్ర, ప్రభావం శ్లాఘనీయం. శ్రీసిటీ ప్రారంభం ముందు నుంచే శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా సీఎస్సార్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సేవలు, సామాజిక మౌళిక సదుపాయాలు, జీవనోపాధి వంటి వివిధ కీలక సామాజిక అవసరాలపై దృష్టి సారించి, సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ స్వచ్చంధసంస్థలు మరియు విద్యా సంస్థలు నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వేలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్పష్టంగా పేర్కొన్నాయి. శ్రీసిటీ స్థాపన తర్వాత, ఇక్కడి గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంలో శ్రీసిటీ కీలక పాత్ర పోషించటమేకాకుండా, స్వయంస్థిరమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతున్న విషయాన్ని ఆ సర్వేలు నిర్ధారించాయి.
శ్రీసిటీ రాక ముందు, వర్షాభావ పరిస్థితులు, నీటిపారుదల వసతులు లేని కారణంగా ఈ ప్రాంతంలో తగు ఉపాధి అవకాశాలు వుండేవి కావు. సరైన విద్య, వైద్య సదుపాయాలు లేవు. తద్వారా వెనుకబాటు తనానికి గురైంది. నేడు, దేశంలోనే ఖ్యాతి గడిరచిన శ్రీసిటీ పారిశ్రామిక నగర స్థాపనతో, అనేక పెద్ద పెద్ద కంపెనీలు, ప్రఖ్యాత ఉన్నత విద్యా సంస్థల ఉనికితో, ఈ ప్రాంతం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. మరియు దీర్ఘకాలిక ఆర్ధికాభివృద్ధికి మంచి ఆస్కారం ఉన్న అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటిగా శ్రీసిటీ నిలుస్తుంది.






