AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సంచలనం
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ(YSRCP) అధికారంలో ఉన్న సమయంలో లిక్కర్ స్కాం జరిగిందని అప్పట్లో టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం ఒకటి అయితే, ఆన్లైన్ పేమెంట్(Online Payment) లేకపోవడం సహా అనేక అంశాల్లో తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అప్పట్లో క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పాలి.
ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ కోసం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో ఎప్పటికప్పుడు కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అటు మాజీ సిఎం వైఎస్ జగన్(YS Jagan) కు ఓఎస్డీ గా పని చేసిన.. కృష్ణ మోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతి వ్యాపార వ్యవహారాలను చూసే బాలాజీ గోవిందప్పలకు హైకోర్ట్ బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్ లుగా మారుతున్నట్టు హైకోర్ట్ కు నివేదించారు. వైసీపీ హయాంలో నూతన మద్యం పాలసీ అమలులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అత్యంత కీలక వ్యక్తులు. వైసీపీ హయాంలో బేవరేజెస్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్.. సూచనలతోనే మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో లిక్కర్ స్కాం నిందితులపై మరింత గురిపెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.






