YCP: ప్రజాభిప్రాయం, పార్టీ సంక్షోభం..వైసీపీ ముందున్న కీలక సవాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y S Jagan Mohan Reddy) ఇటీవల ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు. దేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత విమర్శలు ఎదుర్కొన్న మరో ప్రభుత్వం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం పూర్తిగా విరుద్ధ దిశలో ముందుకెళ్తూ ఆయన ధీమాను పరీక్షించే ప్రయత్నంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రక్రియను వేగంగా ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) కూడా ఓటర్ల జాబితా సవరణ, రిజర్వేషన్ల సిద్ధత, బ్యాలెట్ బాక్స్ ల సేకరణ వంటి పనుల్లో నిమగ్నమైంది. ఈ వేగాన్ని చూస్తుంటే మార్చి నాటికి పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ప్రజల్లో ప్రభుత్వంపై స్పందన చూస్తే, కూటమి ప్రభుత్వం సంక్షేమం (welfare) , అభివృద్ధి పనులను సమానంగా తీసుకెళ్తోందన్న అభిప్రాయం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న పథకాలు, రోడ్లు, నీటి సౌకర్యాలు వంటి పనులు ప్రజలకు చేరువవుతున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తోసిపుచ్చుతోంది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉందని, 2029లో తమ గెలుపు ఖాయం అని బహిరంగంగా చెబుతోంది. ఇప్పుడు తమ ఆ వాదనను రుజువు చేసుకునే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తోంది. దీనిని ఒకరకంగా సెమీఫైనల్ ఎన్నికలుగా అనుకోవచ్చు, ఎందుకంటే వైసీపీకి (YCP ) ప్రజలు ఇంకా తమ పక్షాన ఉన్నారు అని నిరూపించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం.
కానీ వైసీపీకి ఊహించినంత రేంజ్ లో ప్రజల మద్దతు పొందే అవకాశం కల్పించడం లేదు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకత్వం అందుబాటులో ఉండటం లేదని, ఎన్నికల్లో నిలబడాలంటే భారీ ఖర్చు తప్పదని నేతలు అభిప్రాయపడుతున్నారు. అదనంగా అధికార పక్షం దూకుడు, ప్రజల్లో పెరుగుతున్న సంతృప్తి శాతం వైసీపీకి భారీ సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా స్థానికంగా ఉన్న చిన్నస్థాయి వైసీపీ నేతలు హైకమాండ్‌కు ఎన్నికలను బహిష్కరించాలని సూచిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ (TDP) కొన్ని స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన ఘటనను ఉదాహరణగా చూపుతున్నారు. అప్పట్లో పెద్దగా నష్టం కాలేదని, ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి భవిష్యత్తులో అపాయమేమీ లేదని కొందరు భావిస్తున్నారు.
అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం పదేపదే ప్రజల్లో అసంతృప్తి ఉందని చెబుతున్న దృష్ట్యా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటం ఆ వాదనకే విరుద్ధంగా మారుతుంది. పోటీ చేస్తే ఫలితాలు బలహీనంగా వస్తే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం పెరుగుతుంది. పోటీ చేయకపోతే బలహీనత బయటపడినట్లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.






