Draupadi Murmu: పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha), దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీ రాజకుమారి, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన 4.40 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), హోం శాఖ మంత్రి అనిత, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఆమెను స్వాగతించారు. ఆలయ మహద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి అమ్మవారి సన్నిధికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ మండపంలో వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సుమారు 45 నిమిషాల పాటు గడిపిన రాష్ట్రపతి తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆమెకు స్వాగతం పలికారు.






