Pawan Kalyan: స్థానిక ఎన్నికల దిశగా పవన్ స్ట్రాటజీ… జనసేనలో భారీ మార్పులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్(AP)లో స్థానిక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పార్టీని మరింత దృఢంగా మార్చే దిశగా చర్యలను వేగవంతం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఏడాదిన్నర పాటు అధికారిక బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నమైన ఆయన, ఇప్పుడు పార్టీ విస్తరణపై మళ్లీ దృష్టిసారించారు. చేపట్టబోయే స్థానిక ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ స్థానాలు రావాలంటే గ్రామ స్థాయిలోనే బలమైన వ్యవస్థ అవసరమని పవన్ భావిస్తున్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల ,నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని పవన్ నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. పొత్తు రాజకీయాల్లో భాగంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు వాటా వచ్చినా, పార్టీ స్థాయి పదవులను నింపాలని కేడర్ చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో బలమైన కమిటీలు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ ప్రభావం పెరుగుతుందని జనసేన అధిష్టానం అభిప్రాయపడుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. జనవరి నుంచి ఎప్పుడైనా స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో, వెంటనే గ్రామం నుంచి రాష్ట్రం వరకు కమిటీల ఏర్పాటుకు సీనియర్ నేతలను ఆదేశించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలోనే కాకుండా ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేసే బాధ్యత కూడా ఈ కమిటీలదేనని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జనసేనకు ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విశాఖ(Visakhapatnam), గోదావరి(Godavari) జిల్లాల్లో బలమైన కేడర్ ఉందని భావిస్తున్నారు. అదే స్థాయిలో నెల్లూరు(Nellore), ప్రకాశం(Prakasam), గుంటూరు(Guntur), కృష్ణా(Krishna), విజయనగరం(Vizianagaram), శ్రీకాకుళం(Srikakulam) జిల్లాల్లోనూ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఈ చర్చల్లో ఈ విషయాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల్లో విజయం సాధించాలంటే గ్రామస్థాయిలో బలమైన నాయకత్వం అవసరం. అయితే పలుమార్లు ప్రయత్నించినప్పటికీ సరైన నాయకులను తయారు చేయడంలో లోపాలు ఉన్నాయని కూడా పవన్ గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే వచ్చే నెలల్లోనే నిబద్ధత, ప్రజాదరణ, క్షేత్రస్థాయి అనుభవం ఉన్నవారిని గుర్తించి పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో వైసీపీ(YCP) నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలకూ జనసేన దారులు తెరిచినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీని విస్తరించే క్రమంలో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వడమే కాకుండా, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కేడర్‌ను దృఢపరచడంపై పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు, రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రాధాన్యతను పెంచే అవకాశాలు చూపిస్తున్నాయి.






