Pawan Kalyan: పవన్ ఫోటో వివాదం..ఏపీ కూటమి ప్రభుత్వంలో కొత్త చర్చలు
ఏపీలో (Andhra Pradesh) ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు మంచి సామరస్యం చూపిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి పాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహాయం కూడా సకాలంలో అందుతోంది. ఈ విజయవంతమైన కూటమి రూపుదిద్దుకోవడంలో పవన్ పాత్ర ఎంతో ముఖ్యమని ప్రభుత్వం లోపల కూడా అంగీకారం ఉంది. అందుకే చంద్రబాబు, తనతో పాటు పవన్ కళ్యాణ్‌కు పాలనలో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే విధానాన్ని అనుసరిస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ,ప్రధాని (Prime Minister) ఫోటోలు మాత్రమే ఉంచే పద్ధతి ఉన్నా, ఈసారి మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ప్రదర్శించాలన్న ఆదేశాలు వెలువడ్డాయి. దీనికి కారణం కూటమి ఏర్పాటులో ఆయన పోషించిన కీలక పాత్ర. అత్యంత క్లిష్ట సమయంలో జనసేన ముందుకు రావడం, తెలుగుదేశం పార్టీకి దండిగా మద్దతు ఇవ్వడం, అదనంగా బీజేపీ (BJP) ను కూడా ఒప్పించి కూటమిని బలోపేతం చేయడం..ఇవి పవన్ కళ్యాణ్ విశేషంగా చేసిన పనులు. కాపు సామాజిక వర్గం సహా అనేక వర్గాలను ఒకే దిశగా నడిపినందుకు ఆయనకు ప్రత్యేక గౌరవం దక్కింది. గత ప్రభుత్వాల్లో ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, వారికి ఇలాంటి గుర్తింపు రాలేదు.
అయితే ఇటీవల కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫోటో తొలగించబడింది. విచారణ చేస్తే కోర్టు ఆదేశాల కారణంగా తీసేశామని కొందరు అధికారులు వివరణ ఇస్తున్నారు. జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోలు ప్రదర్శించడంపై హైకోర్టులో పెట్టిన పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. అయినప్పటికీ, ఆయన సుప్రీంకోర్టు (Supreme Court) కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు జోక్యం చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిస్థితి సరిగ్గా హాండిల్ చేయకపోతే , టిడిపి (TDP), జనసేన మధ్య అపార్థాలు రావచ్చు. ప్రభుత్వం ప్రారంభ దశలోనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంపై కూటమి శ్రేణులు స్పష్టత తీసుకోవడం అవసరం. అంతిమంగా, ప్రభుత్వం సమగ్రంగా నడవాలంటే రెండు పార్టీల మధ్య నమ్మకం , సమన్వయం కొనసాగాలి. లేకపోతే పొత్తు పునాదులకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.






