NDA: కూటమి బల ప్రదర్శన సూపర్ సక్సెస్..!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం (TDP), జనసేన, భారతీయ జనతా పార్టీ (BJP)ల కూటమి ఐక్యతపై అనేక అనుమానాలున్నాయి. 2014-19 మధ్య బీజేపీతో ఏర్పడిన విభేదాలతో నాడు ఎన్డీయే కూటమి విఫలమైంది. అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని చాలా మంది ఆశిస్తున్నారు. కూటమి విచ్ఛిన్నమైతే అధికారం దక్కించుకోవడం సులభమవుతుందని వైసీపీ కూడా ఆశిస్తోంది. అయితే ఇలాంటి వాళ్లందరి ఆశలపైన నీళ్లు చల్లాయి కూటమి పార్టీలు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కర్నూలు జిల్లా పర్యటన కూటమి పటిష్టతకు, నాయకత్వం మధ్య ఉన్న సమన్వయానికి గట్టి నిదర్శనంగా నిలిచింది.
కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) వేదికపై సమన్వయంతో వ్యవహరించడం కూటమి పార్టీల్లోని అంతర్గత బంధాన్ని తెలియజేసింది. సభలో ప్రధాని మోదీ రాష్ట్ర నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం కూటమి నేతలకు, కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. “సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉంది” అని మోదీ వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్ర కూటమికి కేంద్రం తరఫున పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేశ్ కృషిని కూడా మోదీ మెచ్చుకోవడం ద్వారా యువ నాయకత్వానికి ప్రోత్సాహం లభించింది.
కూటమి నేతలు కూడా ఈ ఐక్యత సుదీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితంగా ప్రజలకు మంచి చేస్తుందని పునరుద్ఘాటించారు. రాష్ట్రానికి మోదీ నాయకత్వంలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగడం కేంద్ర-రాష్ట్రాల సమన్వయానికి నిదర్శనం అన్నారు.
ప్రధాని మోదీ పర్యటన కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది మూడు పార్టీల మధ్య ఉన్న పటిష్టమైన బంధాన్ని రాజకీయంగా బలంగా చాటి చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతలకు పిలుపునివ్వడం, అందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేయడం, మూడు పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.
ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఐక్యత దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ లో పాలక కూటమికి ఇప్పట్లో ఢోకా లేదని, మూడు పార్టీలు సమష్టిగా, సుదీర్ఘకాలం పాటు అధికారాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కనీసం 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండడం ఆంధ్రప్రదేశ్ కు అవసరం అన్నారు. మొత్తం మీద, మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకానికి, సుస్థిర పాలనకు నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.