Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం..?
ఆంధ్రప్రదేశ్(AP) లో స్థానికల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఎన్నికల కమీషన్ దీనిపై పూర్తి కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ఎన్నికల కమీషన్ లేఖలు రాసింది. 175 నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను ఈసీ నుంచి ఎన్నికల సంఘం తీసుకుంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది ఎస్ఈసీ. రిజర్వేషన్ల ఖరారు తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉంది. ముఖ్యంగా ఓటర్ ల జాబితా విషయంలో తీవ్ర విమర్శలు కూడా ఉన్న నేపధ్యంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
మరణించిన ఓటర్లు, వలస వెళ్ళిపోయిన వారు, కొత్త ఓటర్లు సహా పలు కీలక అంశాలపై కసరత్తు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఓటర్ల లిస్టు పై విమర్శలు ఉన్నాయి. దీనితో పూర్తి స్థాయిలో కసరత్తు మొదలుపెట్టింది. అటు రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ క్యాడర్ను రాజకీయ పార్టీలు సిద్దం చేస్తున్నాయి. అలాగే ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ వద్ద 1.20 లక్షల బ్యాలెట్ బాక్సులు ఉండగా.. అదనంగా లక్ష బ్యాలెట్ బాక్సులు తెప్పిస్తోంది.
ఎన్నికల కోసం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ నుంచి అదనపు సిబ్బందిని ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కోరనుంది. వైసీపీ హయాంలో 2021 ఫిబ్రవరి, ఏప్రిల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తీవ్ర విమర్శలకు వేదికగా స్థానిక ఎన్నికలు మారాయి. ఇక అప్పటి ఎన్నికలకు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న గ్రామ పంచాయతీల పదవీ గడువు ముగుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 17న మున్సిపాలిటీల గడువు, 2026 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీల గడువు ముగుస్తుంది. అటు పంచాయితీల విలీనం క్లియరెన్స్ పై కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించింది.






