YCP: కార్యకర్తల సంక్షేమంలో ముందున్న జనసేన–టిడిపి, వెనుకబడిన వైసిపి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress) ఏర్పడ్డ సమయంలో ప్రజల్లో ఉన్న భావోద్వేగం, ముఖ్యంగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి (Y S Rajasekhar Reddy) ఆకస్మిక మరణంతో వచ్చిన సానుభూతి, ఆ పార్టీకి అసాధారణమైన బలం ఇచ్చింది. ఆ రోజుల్లో ఏర్పడిన అభిమాన వాతావరణం ఇంకా చాలా ప్రాంతాల్లో అలాగే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి (Y S Jagan Mohan Reddy) కోసం తమ ప్రాణాలకైనా వెనకాడని అభిమానులు ఉన్నారు. అయితే ఈ అభిమానుల కోసం పార్టీ అధినేత తీసుకునే చర్యలేమిటనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది.
ఇటీవలి రోజుల్లో జనసేన పార్టీ (Janasena Party) తమ కార్యకర్తల కోసం తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో కొత్త ప్రమాణంగా మారింది. ఏవైనా ప్రమాదాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే బీమా విధానాన్ని జనసేన అమలు చేసింది. ఇప్పటికే 1000 మందికి పైగా కుటుంబాలకు సహాయం అందించగా, ఇటీవల 220 మందికి సుమారు 11 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) చేతుల మీదుగా నిర్వహించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూడా కార్యకర్తల సంక్షేమంలో ముందుగానే ప్రణాళికలు రూపొందించింది. సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా అందించే విధానాన్ని నారా లోకేష్ (Nara Lokesh) ఆచరణలో పెట్టారు. కేవలం ₹100 చెల్లించి లక్షల రూపాయల రక్షణ పొందటం కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించింది. ఈ చర్యలు పార్టీపై విశ్వాసాన్ని పెంచడంతో పాటు, కార్యకర్తలు నిజంగా ఆదరణ పొందుతున్నారనే భావనను కలిగిస్తున్నాయి.
కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇలాంటి ప్రయోజనాలు ఏవీ పొందటం లేదు. ఎన్నో సందర్భాల్లో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు ప్రమాదాల్లో పడినా, ఆర్థిక సహాయం అందే వ్యవస్థ పార్టీ దగ్గర లేదు. అధినేత జగన్ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఏదైనా సంక్షేమ చట్టం తెస్తారా? లేదా కనీసం బీమా పథకాన్ని ప్రవేశపెడతారా? అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు. పార్టీ కోసం ఎంతో సమర్పణతో పనిచేసే శ్రేణులకు ఇది నిరాశ కలిగించే అంశంగా మారింది.
ఇప్పటికీ జగన్ను నాయకుడిగా..దేవుడిలా భావించే అభిమానులు ఉన్నారు. కానీ ఆ అభిమానాన్ని గౌరవించే విధంగా నాయకత్వం వ్యవహరిస్తుందా అన్న ప్రశ్న మరింత బలంగా వినిపిస్తోంది. జనసేన, టిడిపి వంటి పార్టీలు కార్యకర్తలను అండగా నిలుస్తున్న తరుణంలో, వైయస్సార్ కాంగ్రెస్ కూడా తన శ్రేణలకు కనీసం భరోసా ఇచ్చే విధంగా వ్యవహరిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదే నైజం కొనసాగితే కార్యకర్తలు వైసిపిని వీడి పక్క పార్టీలవైపు మొగ్గ చూపడానికి ఎక్కువ సమయం పట్టదు.. ఈ విషయాన్ని వైసిపి అధినాయకత్వం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే పార్టీ భవిష్యత్తుకి అంత మంచిది.






