YS Jagan : కొడాలి నాని, వల్లభనేని వంశీలకు జగన్ వార్నింగ్..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పార్టీ పునర్నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani), గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ల (Vallabhaneni Vamsi Mohan) తీరుపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం వాళ్లిద్దరినీ తాడేపల్లికి పిలిపించుకున్న జగన్.. నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండాలని, లేకుంటే మీ స్థానాల్లో వేరే వారికి బాధ్యతలు అప్పగించాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, జగన్ చేసిన ఈ హెచ్చరికలు క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వీళ్లను కాదని కొత్తవారికి బాధ్యతలు ఇస్తే వైసీపీకి లాభమా? నష్టమా? అన్నదే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
గత ఐదేళ్లలో ప్రతిపక్ష టీడీపీపై మాటల తూటాలు పేల్చిన కొడాలి నాని, వల్లభనేని వంశీ.. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉండకపోవడం, ప్రజా సమస్యలపై స్పందించకపోవడం వంటి అంశాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు ప్రజల్లో ఉండకపోతే క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నది జగన్ ఆవేదన. అందుకే, తక్షణమే ప్రజాక్షేత్రంలోకి రావాలని, లేదంటే ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తానని ఆయన అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
జగన్ హెచ్చరికలు సిద్ధాంతపరంగా బాగానే ఉన్నా, ఆచరణలో అవి బెడిసికొట్టే ప్రమాదమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. గుడివాడలో నాని, గన్నవరంలో వంశీలకు మించిన ప్రత్యామ్నాయం వైసీపీలో లేకపోవడమే. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు కంటే.. నాని, వంశీల వ్యక్తిగత ఓటు బ్యాంకే బలంగా ఉంది. వారు పార్టీలో ఉన్నా, లేకున్నా వారి వెంటే నడిచే వర్గం అక్కడ పెద్ద ఎత్తున ఉంది. దశాబ్దాలుగా వీరిద్దరూ తమ నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. వీరి నీడలో మరో నాయకుడు ఎదిగే అవకాశం రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా వీరిని పక్కనపెడితే, ఆ ఖాళీని భర్తీ చేసే సత్తా ఉన్న నేతలు వైసీపీలో కనీసం కనిపించడం లేదు.
ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో, బలమైన ఆర్థిక వనరులు, క్యాడర్ బలం ఉన్న నాని, వంశీలను కాదని కొత్తవారికి పగ్గాలు ఇవ్వడం ఆత్మహత్యాసదృశమే అవుతుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో, అధికార కూటమిని ఢీకొట్టాలంటే ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేతలు కావాలి. కొత్తవారు వచ్చి ఇప్పుడు బాధ్యతలు చేపట్టినా, క్యాడర్ వారిని నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ జగన్ కొత్తవారిని నియమిస్తే, అది నియోజకవర్గంలో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తుంది. నాని, వంశీ వర్గీయులు కొత్తవారికి సహకరించే ప్రసక్తే ఉండదు. ఇది అంతిమంగా పార్టీని మరింత బలహీనపరుస్తుంది.
కొడాలి నాని, వంశీలు ఓటమి భారంతో, కేసుల భయంతో లేదా మరే ఇతర కారణాలతో సైలెంట్‌గా ఉండి ఉండవచ్చు. కానీ, వారికున్న మాస్ ఇమేజ్, పొలిటికల్ గ్రిప్ ఇంకా చెక్కుచెదరలేదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జగన్ చేయాల్సింది వారిని బెదిరించడం కాదు, వారిని తిరిగి యాక్టివేట్ చేయడం. మిమ్మల్ని తప్పిస్తాం అని చెప్పడం కంటే, వారికి భరోసా ఇచ్చి, మళ్లీ జనంలోకి వెళ్లేలా ప్రోత్సహించడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. వారిని కాదని వేరే ప్రత్యామ్నాయం వెతుక్కుంటే, కృష్ణా జిల్లాలో వాళ్లిద్దరి వల్ల కంచుకోటలుగా ఉన్న ఆ రెండూ వైసీపీ చేజారినట్లే.
మొత్తానికి, జగన్ తీసుకున్న ఈ నిర్ణయం లేదా ఇచ్చిన హెచ్చరిక.. ఆయన అసహనాన్ని చూపిస్తోంది తప్ప, వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపించడం లేదు. గుడివాడ, గన్నవరం లాంటి చోట్ల నేనే రాజు.. నేనే మంత్రిగా వ్యవహరించే నాని, వంశీ లాంటి వారి దగ్గర ఈ హెచ్చరికల మంత్రం పనిచేయదు. వారిని బుజ్జగించి, మళ్ళీ రణక్షేత్రంలోకి దించడమే వైసీపీకి తక్షణ అవసరం. మరి జగన్ తన శైలి మార్చుకుంటారా? లేక మొండిగా ముందుకెళ్లి కొత్త ప్రయోగాలు చేస్తారా? అన్నది వేచి చూడాలి.






