TTD: టీటీడీ పరకామణి వ్యవహారం.. సీఐడీ దర్యాప్తు
టీటీడీ పరకామణి వ్యవహారంపై సీఐడీ (CID) దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) ఆదేశించింది. చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. చోరికి పాల్పడిన రవికుమార్ (Ravikumar) ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ (ACB) ని ఆదేశించింది. కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. రవికుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు, బ్యాంకు ఖాతాలు పరిశీలించాలంది. ఆస్తులు బదలాయించారా? అనే అంశంపైనా దర్యాప్తు చేయాలని పేర్కొంది. నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023లో తిరుమల పరకామణిలో చోరీ కేసు నమోదైంది. ఈ ఘటనపై 2023లోనే టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు అందింది. ఉద్యోగి రవికుమార్ పెద్దఎత్తున పరకామణిని కొల్లగొట్టారని అందులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి టీటీడీ అధికారులు సమగ్ర దర్యాప్తు జరపకుండా లోక్ అదాలత్‌లో రాజీ చేయించారు. ఈ ఘటనపై పిటిషన్ దాఖలు కావడంతో హైకోర్టు విచారణకు స్వీకరించింది.








