Chandrababu : రాయలసీమ రోడ్ మ్యాప్ రెడీ చేసిన చంద్రబాబు?
ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) కడప జిల్లా (Kadapa District) పర్యటనలో రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెండ్లిమర్రిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన కేవలం ప్రతిపక్ష వైసీపీపై విమర్శలకు పరిమితం కాలేదు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, నేతల ప్రవర్తనా నియమావళి, రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉండాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు వెల్లడించారు. ఇది శ్రేణుల్లో కొత్త ఉత్సాహానికి కారణమవుతోంది.
వైసీపీని (YCP) చంద్రబాబు బీహార్ (Bihar) లో ఆర్జేడీతో (RJD) పోల్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, అవినీతి కారణంగా ఆ పార్టీ సుమారు 20 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. లాలూ తర్వాత వారసుడు తేజస్వి యాదవ్ వచ్చినా పార్టీని గట్టెక్కించలేకపోయారని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి కూడా లాలూ కంటే ఎక్కువ తప్పులు చేశారని, కాబట్టి వైసీపీ కూడా ఆర్జేడీ లాగే దీర్ఘకాలం పాటు ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. ఇది వైసీపీ క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు టీడీపీ కేడర్ లో జోష్ నింపుతుంది. అంతేకాక వైసీపీ ఇక అధికారంలోకి రాదు అని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేశారు.
కేవలం ఐదేళ్లు అధికారంలో ఉంటే సరిపోదని, వరుసగా ఎన్నికల్లో గెలిస్తేనే రాష్ట్రం, పార్టీ బాగుపడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు ఆయన గుజరాత్లో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని ఉదాహరణగా చూపారు. మధ్యలో అధికారం కోల్పోతే కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడతారో గత ఐదేళ్లలో చూశామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ కూడా నిరంతరాయంగా అధికారంలో కొనసాగేలా ఇప్పటి నుంచే పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే యంత్రాంగం సిద్ధం కావాలని సంకేతాలిచ్చారు.
ఎన్నికల్లో గెలిచాం కదా అని నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించారు. మంత్రి నిమ్మల రామానాయుడును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన నిత్యం సైకిల్‌పై తిరుగుతూ, ప్రజల్లో ఉంటారని గుర్తు చేశారు. రామానాయుడు శైలిని అనుసరించాలని, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి వంటి యువ నేతలకు సూచించారు. పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేయాలే తప్ప, వారిపై పెత్తనం చెలాయించకూడదని స్పష్టం చేశారు. గెలిచిన చోట్ల కూడా పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నది ఆయన మాటల్లో వ్యక్తమైంది.
ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాయలసీమ ముఖచిత్రం మారుస్తున్నామని చంద్రబాబు వివరించారు. ముఠాలను అణచివేయడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడలు, విమానాల తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా సీమలో ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. పులివెందుల, బద్వేలు వంటి వైసీపీ కంచుకోటల్లోనూ కొద్దిగా కష్టపడి ఉంటే గెలిచేవాళ్లమని, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయిలో అధికారులు తమ మాట వినడం లేదని, ఇంకా పాత పద్ధతులే కొనసాగిస్తున్నారని కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తప్పు చేసిన అధికారులను కూడా వదిలిపెట్టనని, త్వరలోనే మార్పు చూస్తారని చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపించకూడదని, నెలాఖరులోపు కమిటీలు వేసి వ్యవస్థను చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. మొత్తంగా, చంద్రబాబు ప్రసంగం కేవలం రాజకీయ ఉపన్యాసంలా కాకుండా, పార్టీ భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లా ఉంది. అరాచక శక్తులు మళ్లీ తలెత్తకుండా చూడటం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, నేతలు ప్రజలకు జవాబుదారీగా ఉండటం అనే మూడు స్తంభాలపై వచ్చే ఎన్నికల విజయం ఆధారపడి ఉంటుందని ఆయన తన శ్రేణులకు స్పష్టం చేశారు.






