AP Cyclones: హుద్ హుద్ నుంచి మొంథా వరకూ – ఏపీ తుఫాన్ చరిత్ర..
సుదీర్ఘ సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం ప్రతి సంవత్సరం తుఫాన్ల బారిన పడుతోంది. బంగాళాఖాతం (Bay of Bengal) ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీకాకుళం (Srikakulam) నుంచి నెల్లూరు (Nellore) వరకు ఉన్న తీరప్రాంతం ఎక్కువగా ప్రభావితమవుతోంది. ఈ తుఫాన్ల సమయంలో వచ్చే బలమైన గాలులు, భారీ వర్షాలు పంటలకు, విద్యుత్ వ్యవస్థలకు, ఇళ్లకు గణనీయమైన నష్టం కలిగిస్తుంటాయి. ముఖ్యంగా రెండు సీజన్లలో మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి. వేసవిలో వచ్చే తుపాన్లు మామిడితోపాటు ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తే, శరదృతువులో వచ్చే తుఫాన్లు వరి పంటలను దెబ్బతీస్తాయి.
1971 నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటిన తుఫాన్ల సంఖ్య 60 దాటింది. పక్కనే ఉన్న ఒడిశా (Odisha), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల్లో ఏర్పడే తుఫాన్లు కూడా ఏపీ తీరంపై పరోక్ష ప్రభావం చూపుతాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నందున తుఫాన్ల తీవ్రత కూడా పెరుగుతోంది. 1971లో శ్రీకాకుళం జిల్లా బారువ (Baruva) వద్ద తీరం దాటిన తుఫాన్ ఉద్దానం ప్రాంతాన్ని బాగా దెబ్బతీసింది. తరువాత 1977లో వచ్చిన దివిసీమ (Diviseema) ఉప్పెన మాత్రం ఆంధ్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా బీభత్సం సృష్టించింది. ఆ తుఫాన్ కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
తర్వాతి దశలో 1996లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తొలి సారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరో భారీ తుఫాన్ కోనసీమ (Konaseema) ప్రాంతాన్ని కుదిపేసింది. తూర్పుగోదావరి (East Godavari) జిల్లా బులుసుతిప్ప (Bulusutippa) వద్ద తీరం దాటిన ఆ తుఫాన్ పెద్ద ఎత్తున వరదలను తెచ్చి పంటలను పూర్తిగా నాశనం చేసింది. 2000 తర్వాత తుఫాన్లకు పేర్లు పెట్టడం మొదలైంది. 2000 నుండి 2005 మధ్యకాలంలో ఏపీని ఐదు తుఫాన్లు దాటినట్లు ప్రభుత్వం రికార్డులు చెబుతున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చూసిన అతిపెద్ద తుఫాన్ హుద్ హుద్ (Hudhud) అని చెప్పవచ్చు. 2014లో విశాఖపట్నం (Visakhapatnam) తీరాన్ని దాటిన ఈ తుఫాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ఆ తుఫాన్ సమయంలో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ విపత్తు కారణంగా రాష్ట్రానికి దాదాపు రూ. 21,900 కోట్ల నష్టం వాటిల్లింది. హుద్ హుద్ తుఫాన్ తర్వాత వచ్చిన ప్రతి తుఫాన్‌ను ప్రజలు ఆ తీవ్రతతో పోలుస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ఏర్పడిన మొంథా (Monta) తుఫాన్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ తుఫాన్ సమయంలో గంటకు 100–120 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావం కొబ్బరి, అరటి తోటలపై తీవ్రంగా ఉండవచ్చని రైతులు భయపడుతున్నారు. విద్యుత్ సరఫరాపై కూడా అంతరాయం కలగొచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటూ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. ప్రతి సంవత్సరం తుఫాన్లతో తీరప్రాంత ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నా, వారు తిరిగి నిలబడే ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ధైర్యసాహసానికి నిదర్శనంగా మిగిలిపోతున్నాయి.








