Nara Lokesh: నాసిన్ కేంద్రంలో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీల ఇంటరాక్షన్ ప్రోగ్రామ్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి పాల్గొన్న మంత్రి నారా లోకేష్
పాలసముద్రం:శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్(NACIN) కేంద్రంలో నిర్వహించిన వివిధ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీల ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా నాసిన్ కేంద్రానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ నిర్మాణంలో సివిల్ సర్వెంట్స్ కీలకపాత్ర పోషిస్తారు. జీఎస్టీ భారత పరోక్ష పన్నుల వ్యవస్థను సరళీకరించిన చరిత్రాత్మక సంస్కరణ. పన్ను ఎగవేతదారులను అరికట్టాలి.
సమాజ ప్రయోజనాల కోసం రూపొందించిన చట్టాలు కచ్చితంగా అమలు కావాలి. వ్యక్తిగత ప్రతిభ కంటే.. బృంద ప్రతిభ లక్ష్యంగా పెట్టుకోవాలి. సామర్థ్య పెంపునకు iGOT కర్మయోగి ప్లాట్ ఫాం అద్భుతమైన వేదిక అని అన్నారు. 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలసముద్రంలో నూతనంగా నిర్మించిన NACIN ప్రాంగణాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. భారతదేశ కస్టమ్స్, జీఎస్టీ పరిపాలనకు, సామర్థ్య నిర్మాణానికి కేంద్రంగా NACIN ఒక ప్రముఖ సంస్థగా అవతరించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనిక నాయకత్వం భారతదేశాన్ని బలమైన, వికసిత్, ఆత్మనిర్భర్ భారత్‌గా మార్చడానికి పునాది వేసిందని ఆయన అన్నారు. ప్రపంచం వేగంగా మారుతోందని, సాంకేతికత ప్రతిరోజూ అభివృద్ధి చెందుతోందని, అందువల్ల అధికారులు కొత్త అవసరాలను తీర్చడానికి నైపుణ్యం పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి కార్యదర్శి అమిత్ ఖరే, నాసిన్ (NACIN) కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.






