Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి అనారోగ్యం.. ఇది జగన్ కోసం ప్రయత్నం?
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) పరిస్థితి రోజు రోజుకు మరింత క్లిష్టంగా మారుతోంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అరెస్టు సమయంలో గట్టిగా ప్రకటించిన ఆయన, ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉంటూ వరుసగా బెయిల్ పిటిషన్లు వేస్తున్నా, కోర్టులు వాటిని పరిగణించడంలేదు. తాజాగా కాళ్ల నొప్పి సమస్యతో బాధపడుతున్నానని జైలు అధికారులకు తెలియజేయడంతో, వారు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిజానికి ఆరోగ్య సమస్యల పేరుతో ఆసుపత్రికి వెళ్లడం భాస్కర్ రెడ్డికి కొత్త విషయం కాదు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు చేశారు. బయటకు వచ్చిన వారితో పోలిస్తే తాను మాత్రమే ఇరుక్కుపోయానన్న భావన ఆయనలో కనిపిస్తోంది.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఆధారాలు సేకరించిందని తెలిసింది. ఆ ఆధారాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆస్తుల్ని అటాచ్ చేయడానికి అనుమతించిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనితో భాస్కర్ రెడ్డి పరిస్థితి ఇంకా కఠినమైంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఈ వ్యవహారాన్ని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించిందని, కాబట్టి కుంభకోణం ఎలా జరుగుతుందని పార్టీ నాయకులు అప్పట్లో వాదించారు. కానీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఈ స్కామ్‌పై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దర్యాప్తు వేగం పెరిగి, అరెస్టులు వరుసగా జరుగుతున్నాయి.
ఈ కేసులో అరెస్టైన వారిలో చాలామంది కొద్ది రోజులకే బెయిల్ సాధించి బయటకు వచ్చారు. అందులో మాజీ సీఎంవో అధికారి ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy), జగన్‌కు సన్నిహితుడైన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి (Krishnamohan Reddy), భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa), అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) వంటి వారు ఉన్నారు. కానీ భాస్కర్ రెడ్డికి మాత్రం ఎటువంటి ఉపశమనం లభించలేదు. వరుస బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరించబడటమే కాకుండా, ఆస్తులు కూడా అటాచ్ కావడంతో ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
ఈ కేసులో అరెస్టయిన వారిని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పరామర్శించకపోవడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. తమ నాయకుడు పట్టించుకోవడం లేదన్న భావన జైల్లో ఉన్న నేతల్లో పెరుగుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భాస్కర్ రెడ్డి తరచూ అనారోగ్యం పేరుతో ఆసుపత్రులకు తరలించబడటం, ఆయన మనోవేదనకు సూచికగా చాలామంది భావిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో భాస్కర్ రెడ్డి ఎప్పుడు బయటపడతారు? ఆయన ఆరోగ్య సమస్యలు నిజమా లేక కోర్టు దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమా అనే ప్రశ్నలన్నీ ఇంకా సమాధానాలు లేని స్థితిలో ఉన్నాయి. దర్యాప్తు పురోగతిని చూస్తుంటే త్వరలో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా.. అయితే ఈ కేసులో అసలు కీలక వ్యక్తి ఎవరు? ఈ కేస్ కి ముగింపు ఏమిటి అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.






