Chevireddy Bhaskar Reddy: తనపై కేసులు రాజకీయ కక్షపూరితమే అంటూ చెవిరెడ్డి ఆవేదన..
వైసీపీ(YCP ) సీనియర్ నాయకుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy) మద్యం అక్రమాల కేసులో (Liquor Scam) మరోసారి ఏసీబీ కోర్టు (ACB Court) ఎదుట హాజరయ్యారు. పోలీసులు ఆయనను కోర్టుకు తీసుకెళ్లగా, న్యాయమూర్తి చెవిరెడ్డికి తదుపరి 14 రోజుల రిమాండ్‌ను మంజూరు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భావోద్వేగానికి లోనై, తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం రాసుకున్న కథ అని కోర్టులో వాదించారు. ఇటీవల తన ఆస్తులను ప్రభుత్వ ఉత్తర్వులతో జప్తు చేయడం తనను లక్ష్యంగా చేసుకున్న చర్య అని పేర్కొన్నారు.
చెవిరెడ్డి మాట్లాడుతూ, తాను ఏ అవినీతి ద్వారా డబ్బు సంపాదించలేదని, ఉన్న ఆస్తులన్నీ కుటుంబ పెద్దల వారసత్వంగా వచ్చినవేనని తెలిపారు. తాను ప్రజాప్రతినిధిగా పనిచేసినంతకాలం ఎవరికి అన్యాయం చేయలేదని, తన ఆస్తులను అక్రమంగా జప్తు చేయడం అన్యాయం అని అన్నారు. తాను జైలులో ఉన్నా ఎలాంటి భయం లేదని, ప్రభుత్వం ఎన్నాళ్లైనా తనను నిర్బంధంలో ఉంచవచ్చని అన్నారు.
అయితే, కోర్టు దీనిపై వెంటనే స్పందిస్తూ, ఆస్తుల జప్తు అంశం తమ పర్యవేక్షణలో లేదని, సిట్ (SIT) అధికారులు సరైన పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణ అనంతరం చెవిరెడ్డిని మళ్లీ విజయవాడ (Vijayawada) జైలుకు తరలించారు.మరోవైపు, ప్రభుత్వం ఇటీవల చెవిరెడ్డి ఆస్తులను సీజ్ చేయడానికి సిట్ అధికారులకు ఆమోదం తెలిపింది. అయితే దీనికి ముందు కోర్టు అనుమతి తప్పనిసరి అని చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు సూచించారు. ఇప్పటివరకు సిట్ కోర్టులో అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని, పిటిషన్ వచ్చిన తర్వాత తమ వాదనలు సమర్పిస్తామని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) ఆస్తుల్లో 100 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలను అధికారులు స్వాధీనపర్చుకున్నారు. ఆ సమయంలో కోర్టు అనుమతి కూడా లభించింది. అదే విధంగా చెవిరెడ్డి ఆస్తులను కూడా స్వాధీనపర్చేందుకు సిట్ సిద్ధమవుతోంది. మొత్తం 65 కోట్ల రూపాయల వరకు ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చిత్తూరు (Chittoor) జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములు , స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఆస్తులు మద్యం అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేశారని సిట్ అధికారులు తమ నివేదికలో పేర్కొంటున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టాక్.






