Chandrababu: ఎమ్మెల్యే లకు చంద్రబాబు నూతన టైమ్ టేబుల్..
కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పని తీరు పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు (N. Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఇచ్చిన ఫిర్యాదులు, కేబినెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావించిన సమస్యలు, అలాగే మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రజాదర్బార్లో (Praja Darbar) ఒక్కరోజులో వేలాది ఫిర్యాదులు రావడం ఇలా ఇవన్నీ కలిసి సీఎం దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వం ఎంత కష్టపడినా, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి భావించారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు ఎమ్మెల్యేల పనితీరును పక్కాగా పర్యవేక్షించేలా కొత్త విధానాన్ని రూపొందించారు. కూటమి వ్యాప్తంగా ఉన్న శాసనసభ్యులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని పార్టీ ఉన్నత నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల్లోకి వెళ్లకుండా, తమ నియోజకవర్గాలను పట్టించుకోకపోవడం వల్లే ఫిర్యాదులు పెరుగుతున్నాయని సీఎం భావించారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక నెలవారీ టైంటేబుల్ సిద్ధం చేసింది. ఈ ప్రకారం ప్రతి నెల 1వ తేదీన ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీ (Pension Pampini ) కార్యక్రమంలో ఉండటం తప్పనిసరి. ఆ తర్వాత 5వ తేదీన పాఠశాలలను సందర్శించి విద్యార్థుల పరిస్థితులు, మధ్యాహ్న భోజన నాణ్యత, బోధన విధానం వంటి అంశాలపై సమాచారం సేకరించాలి. 10వ తేదీన అన్నా క్యాంటీన్లను తనిఖీ చేసి భోజన నాణ్యత, వాతావరణం, సిబ్బంది ప్రవర్తనపై సమీక్ష చేయాల్సి ఉంటుంది.
కాగా 15వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షణ, 20వ తేదీన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ, 25వ తేదీన మండల కార్యాలయాల తనిఖీ వంటి కార్యక్రమాలు కూడా తప్పనిసరి చేశారు. నెలలో ఎప్పుడో ఒకరోజు గ్రామాలను సందర్శించి, ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని కూడా ఆదేశించారు. అవసరమైతే గ్రామాల్లో రాత్రి బస చేయడం కూడా సూచించారు.
ఇంతకుముందు జరిగిన సమీక్షలో 48 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాలేదనే విషయం సీఎం దృష్టికి రావడంతో, వారికి నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఇకపై ఈ నిర్లక్ష్యం సహించబోమని పార్టీ యంత్రాంగానికి సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ కొత్త విధానం ద్వారా శాసనసభ్యులు ప్రజలతో ఎప్పటికప్పుడు కలిసే అవకాశం పెరుగుతుందని, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని త్వరగా పరిష్కరించే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షించి నివేదికలు సేకరిస్తుంది. ఇదంతా చివరికి ప్రజాభిమానం పెరగడానికి, ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడడానికి ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






