Pemmasani: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి(amaravati) లో రైతుల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వంపై రైతులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. ఒక్కో సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సిఆర్డిఏ అధికారులతో పాటుగా, మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రైతుల సమస్యలపై దృష్టి పెట్టారు. వరుసగా రైతులతో భేటీ అవుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా సిఆర్డిఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఐదేళ్లు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (Ys Jagan) తీరు కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని.. పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాలని మా కమిటీకి సీఎం చంద్రబాబు సూచించారని, నేడు జరిగిన సమీక్షలో కొన్ని సమస్యలపై కమిటీ సభ్యులు చర్చించినట్లు తెలిపారు. 25 గ్రామాలకు సంబంధించి డిపిఆర్ తయారు చేస్తారని పేర్కొన్నారు. సి ఆర్ డి ఏ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరీబు భూములను గుర్తిస్తారని, గ్రామ కంటాల సమస్యను కూడా పరిష్కరిస్తారని తెలిపారు. అడిగిన అందరికీ గ్రామ కంటాలుగా గుర్తించలేమని, మరోసారి క్షేత్రస్థాయిలో గ్రామకంఠలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని, లంక భూముల సమస్యను జగన్ జఠిలం చేసినట్లు మండిపడ్డారు. అసైన్డ్ భూములను కొందరు అమ్ముకుంటే జగన్ ప్రభుత్వం తప్పు బట్టి ఆపేసిందని.. మిగతా ప్రాంతాల్లో అసైన్డ్ భూములకు, రాజధాని లో అసైన్డ్ భూములకు చాలా తేడా ఉందని, ఈ సమస్య రాబోయే మూడు నెలల్లో పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. 90 శాతం మంది రైతులకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు వివరించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామన్నారు.






