AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను (AP Politics) కుదిపేసిన లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) దర్యాప్తు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలులో చక్రం తిప్పిన కీలక అధికారులు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మాజీ ఏపీబీసీఎల్ (APBCL) ఎండీ వాసుదేవరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారినట్లు హైకోర్టుకు తెలియజేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చినప్పుడు, దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన సత్యప్రసాద్ కనుసన్నల్లోనే మద్యం కొనుగోళ్లు, విక్రయాలు, నగదు లావాదేవీలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. అయితే, ఇప్పుడు వీరిద్దరూ అప్రూవర్లుగా మారడంతో, ఈ వ్యవహారంలో తెర వెనుక ఉన్న ‘పెద్దల’ పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది.
సాధారణంగా ఆర్ధిక నేరాల్లో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడం అంటే.. నేరంలో తమ పాత్రను అంగీకరిస్తూనే, తమకు ఆదేశాలు ఇచ్చిన వారి వివరాలను, డబ్బు చేతులు మారిన విధానాన్ని దర్యాప్తు సంస్థలకు పూసగుచ్చినట్లు వివరించడమే. ఇప్పుడు ఈ ఇద్దరు అధికారులు అదే పని చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారడం మిగిలిన నిందితులకు, ముఖ్యంగా గత ప్రభుత్వంలోని రాజకీయ ప్రముఖులకు శరాఘాతంగా మారింది.
మద్యం తయారీ కంపెనీల నుండి ఆర్డర్లు తీసుకోవడం, బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడం వంటి అంశాల్లో ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరి ఆదేశాల మేరకు నిబంధనలు మార్చారు? అనే విషయాలు వీరిద్దరికీ క్షుణ్ణంగా తెలుసు. డిజిటల్ పేమెంట్లను రద్దు చేసి, కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరపాలని తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, ఆ నగదు ఎక్కడికి తరలివెళ్లింది అనే సమాచారం వీరి వద్ద ఉండే అవకాశం ఉంది. కేవలం ఆరోపణలు కాకుండా, నిర్ణయాధికారంలో ఉన్న వ్యక్తులే స్వయంగా “మా చేత ఫలానా వారు ఈ పని చేయించారు” అని కోర్టులో వాంగ్మూలం ఇస్తే, అది కేసులో అత్యంత బలమైన సాక్ష్యంగా మారుతుంది. దీంతో ఈ స్కాంలో ప్రమేయం ఉన్న ఇతర నిందితులు, రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుడుతోంది. అప్రూవర్ల వాంగ్మూలాల ఆధారంగా సిట్ (SIT) తదుపరి అరెస్టులకు రంగం సిద్ధం చేసే అవకాశం లేకపోలేదు.
తాజాగా ఈ అంశం హైకోర్టులో చర్చకు వచ్చింది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారిన విషయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలియజేశారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని ‘సిట్’ (Specical Investigation Team) కోర్టును కోరింది. సిట్ వైఖరిని బట్టి చూస్తుంటే, ఈ కేసును కేవలం అధికారుల స్థాయిలోనే కాకుండా, రాజకీయ సూత్రధారుల వరకు తీసుకెళ్లేందుకు పక్కా ఆధారాలను సేకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అప్రూవర్లుగా మారిన అధికారుల నుంచి ఇప్పటికే కీలక సమాచారాన్ని సిట్ రాబట్టి ఉండవచ్చని, దాన్ని ఆధారంగా చేసుకునే రాబోయే రోజుల్లో సంచలన నిర్ణయాలు ఉండవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాం కేసు.. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే కీలక మలుపులు తిరుగుతోంది. నాడు ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ వంటి వారు అప్రూవర్లుగా మారడంతో అరవింద్ కేజ్రీవాల్, కవిత వంటి అగ్రనేతలు చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఏపీలో కూడా సరిగ్గా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారడం అనేది వైసీపీ హయాంలో జరిగిన మద్యం అవకతవకల డొంక కదిలించడానికి దర్యాప్తు సంస్థలకు దొరికిన అతిపెద్ద అస్త్రం. రానున్న రోజుల్లో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందో వేచి చూడాలి.






