Amaravati: ఏపీ రోడ్లు అద్దాల్లా మెరవాలి.. టార్గెట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు..!
రైజింగ్ ఆంధ్రప్రదేశ్ .. ఇది కూటమి నినాదం.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్న కూటమి సర్కార్… అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అది ఓకె మరి అలాంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి వచ్చే వేళ.. రహదారులు సరిగ్గా లేకుంటే పరిస్థితి ఏంటి..? రాష్ట్రం పరువు పోయే ప్రమాదం ఉంది . ఎందుకంటే ఇప్పటికే పొరుగున ఉన్న కర్నాటకలో రోడ్ల గురించి ఓ రకంగా పెద్ద వివాదాలే చెలరేగుతున్నాయి. అలాంటి పరిస్థితి ఏపీకి రాకూడదని భావించిన కూటమి సర్కార్.. గట్టి చర్యలే చేపడుతోంది.
రాష్ట్రంలో రోడ్లన్నంటిని.. గుంతలరహితంగా మార్చాలని.. డిసెంబర్ ఆఖరుకల్లా ఈ కార్యక్రమం ముగియాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులు, మరమ్మతులు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని.. పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.
‘కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల పనులు కాంట్రాక్ట్ తీసుకుని.. ఇప్పటికి పనులు ప్రారంభించని వారు ఎవరైనా ఉంటే.. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. ఈ పనుల్లో పాత పద్దతులు, విధానాలే కాక.. సరికొత్త సాంకేతిక పద్దతులు, పరికరాలు, మెటిరియల్స్ వినియోగించి.. రోడ్ల అభివృద్ది పనులు చేసే విధానాలను ఇంజినీర్లు తెలుసుకుని.. వినియోగించాలి’ అని చంద్రబాబు సూచించారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, పునరుద్ధరణకు గాను ప్రభుత్వం రూ.2,500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం ఖర్చు చేసి.. రాష్ట్రంలో 5,471 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. వీటిలో చాలావరకు టెండర్లు పూర్తయ్యాయి. అయితే గత కొన్నాళ్లుగా కురిసిన వర్షాలు, తుపాన్ల వల్ల ఈ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వాటిని మొదలు పెడుతున్నారు. ఇక తాజాగా వచ్చిన మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న 4,794 కి.మీ. రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. త్వరలోనే దీనికి కూడా ఆమోదం తెలపనున్నారు.






