Pawan Kalyan: తీర ప్రాంత అభివృద్ధికి దూకుడు..పవన్ నూతన చర్యలు..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉప్పాడ (Uppada) తీర ప్రాంత మత్స్యకారుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను అమలు చేయడానికి వేగం పెంచారు. స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి, సముద్రంలో తగ్గిపోతున్న చేపల సంఖ్యను పెంచడంపై, అలాగే మత్స్యకారులకు అదనపు ఆదాయ మార్గాలను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రణాళికను విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (Visakhapatnam CMFRI) , మత్స్య శాఖ సూచనల ఆధారంగా రూపొందించినట్లు పవన్ తెలిపారు.
ఉప్పాడ తీర రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కోస్టల్ రిజిలియెన్స్ స్కీమ్ (Coastal Resilience Scheme) కింద రూ.2 కోట్లతో పలు పనులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రజలకు పంపిన లేఖలో ఆయన చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. మత్స్య సంపదను సంరక్షించేందుకు ప్రత్యేక రీఫ్‌లు ఏర్పాటు చేయడం, మత్స్యకారుల వేట నైపుణ్యాన్ని పెంపొందించడం, భవిష్యత్తులో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ ప్రణాళికలో భాగమని చెప్పారు.
మత్స్యకారులను తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడి కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం ప్రాజెక్టులను చూపించి విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయ వేట మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు సహాయం చేయడానికి సముద్రంలో చేపల సంఖ్యను పెంచడం రాష్ట్ర చరిత్రలో తొలిసారి జరగుతున్న చర్య అని పేర్కొన్నారు. ఉప్పాడ, కాకినాడ (Kakinada) పరిసరాల్లో లక్షల్లో పండుగప్ప చేప పిల్లలను సముద్రంలో విడిచిపెట్టినట్లు తెలిపారు. త్వరలో టైగర్ ప్రాన్స్ పిల్లలను కూడా విడుదల చేసే ప్రణాళిక ఉందన్నారు.
ఇక మత్స్యకారులు ఇప్పటి వరకు 12 నాటికల్ మైళ్ల దాకా మాత్రమే వేటాడగలిగారని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ పరిధిని 200 నాటికల్ మైళ్ల వరకూ పెంచిందని పవన్ తెలిపారు. దీని వల్ల డీప్ సీ ఫిషింగ్ (Deep Sea Fishing) ద్వారా అధిక ధర దక్కే టూనా చేపలను పట్టుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఉప్పాడలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కోనపాపపేట (Konapapapeta) గ్రామానికి మంజూరైన రూ.2 కోట్లతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నారు. ఈ హాళ్లలో ఆర్.ఒ. ప్లాంట్లు, చేపలు ఎండబెట్టడానికి ప్రత్యేక ఫ్లాట్ఫార్ములు, వేటకు వెళ్లే మత్స్యకారుల ట్రాకింగ్ కోసం జీపీఎస్ (GPS) పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. సముద్రంలో పట్టే చేపలను నిల్వ చేసేందుకు ఐస్ బాక్సులు కూడా అందించనున్నారు.
మత్స్యకార యువతలో ఉన్న ఈత ప్రతిభను ఉపయోగించి కేరళ తరహాలో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ వంటి జల క్రీడల్లో శిక్షణ ఇస్తూ తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తయారుచేయాలని భావిస్తున్నారు. ఈ కోసం కొన్ని మత్స్యకారులను కేరళ ఎకో టూరిజం కేంద్రాలకు, చెన్నై (Chennai) సమీపంలోని తిరువొత్రియూర్ కుప్పం (Tiruvottriyur Kuppam) వద్ద విజయవంతమైన కృత్రిమ రీఫ్ ప్రాజెక్టులకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు.






