ఈ రాష్ట్రాలన్నింటికీ కొత్త గవర్నర్లు.. త్వరలో మోదీ ప్రకటన..!
తమిళనాడు రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ను నియమించే యోచనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. ఇదే విషయంపై ఆయన కార్యాలయం కసరత్తు కూడా చేస్తోంది. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే అంటే మే12వ తేదీలో కొత్త గవర్నర్ నియామకంపై ఒక అధికారపూర్వక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేలో ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనకు వెళ్ళనున్నారు. ఈలోపు కొత్త గవర్నర్ నియామకం చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇన్చార్జ్గా గవర్నర్గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, మధ్యప్రదేశ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించాల్సి ఉంది. దీనికితోడు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలం వచ్చే నెల రెండో తేదీతో ముగియనుంది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్ను నియమించాల్సి ఉంది. ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల ఎంపికతో పాటు తమిళనాడుకు కూడా పూర్తి స్థాయి గవర్నర్ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి రాష్ట్ర గవర్నర్ రేసులో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత నర్సింహులు ముందు వరుసలో ఉన్నారు. ఈయనను మేఘాలయ గవర్నర్గా నియమించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే, ఈఎస్ఎల్ నరసింహన్ సేవలను ప్రధాని మోదీ మరికొంతకాలం ఉపయోగించుకునే ఉద్దేశంలో ఉన్నారు. దీంతో ఆయనను తిరిగి మరో రాష్ట్రానికి గవర్నర్గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త గవర్నర్ల నియామకం కంటే కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని కేంద్ర వర్గాల సమాచారం.













