IRGC: ఖమేనీ హత్యతో రగులుతున్న ఐఆర్ జీసీ..!
ఇరాన్ సుప్రీంనేత ఖమేనీని(KHAMENI) హతమార్చిన తర్వాత.. ఐఆర్ జీసీ సభ్యులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(TRUMP).. హెచ్చరికలు జారీ చేశారు. మీ లీడర్ ను చంపేశాం..మీరు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపొండి.. లేదంటే మీకు మరణం తప్పదని హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరికలను ఐఆర్ జీసీ సభ్యులు పట్టించుకోవడం లేదు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇప్పటికే దాడులు చేసిన ఐఆర్జీసీ.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఐఆర్జీసీ ఏర్పాటు వెనక..?
ఐఆర్జీసీ అనేది ఇరాన్‌లోని విశిష్ట సాయుధ దళం. దీనికి రాజ్యాంగపరమైన గుర్తింపు ఉంది. ఇస్లామిక్ విప్లవం అనంతరం 1979లో ఈ దళం ఏర్పాటైంది. ఇరాన్ సైన్యంతో పాటే ఇది పనిచేస్తుంది. అయితే ఐఆర్జీసీ ఇరాన్ సుప్రీం లీడర్‌కు నేరుగా జవాబుదారీగా ఉంటుంది. అంతర్గత, బాహ్య శక్తుల నుంచి దేశాన్ని రక్షించడం దీని ప్రధాన బాధ్యత. ఖమేనీ కంటే ముందు ఇరాన్ సుప్రీం లీడర్‌గా పనిచేసిన అయతొల్లా రూహుల్లా ఖొమైనీ ఐఆర్జీసీ సభ్యులను ‘ఇస్లామ్ సైనికులు’గా అభివర్ణించారు.
ఐఆర్ జీసీలో 6 లక్షల సైనికులు..
ఇరాన్ సాయుధ బలగాల్లో అత్యంత బలమైనది, అత్యుత్తమ ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నది ఐఆర్‌జీసీయే. ఇందులో గ్రౌండ్ ఫౌర్స్ తో పాటు నౌకాదళం, వాయుసేన, బాసిజ్, కుద్స్ పోర్స్ అనే విభాగాలు ఉంటాయి. బాసిజ్ అంటే అంతర్గత భద్రత వ్యవహారాలను చూసుకునే పౌరసైన్యం. ఇరాన్ బయట ప్రత్యేక ఆపరేషన్లపై కుద్స్ పోర్స్ దృష్టిసారిస్తుంది. ఐఆర్జీసీలో దాదాపు 1.9 లక్షల మంది క్రియాశీలక సభ్యులు ఉంటారు. రిజర్వు సభ్యులను కలుపుకొంటే ఈ బలం 6 లక్షల వరకు ఉంటుంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమం ఐఆర్జీసీ నియంత్రణలోనే జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
బాసిజ్.. స్వచ్ఛంద పారామిలిటరీ బలగం
ఐఆర్జీసీలో భాగంగా ఉండే బాసిజ్ను 1979లోనే స్థాపించారు. ఇది స్వచ్ఛంద పారామిలిటరీ బలగం. ఎక్కువగా దేశభక్తితో యువత ఇందులో చేరుతుంటారు. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లను అణచివేసేందుకు బాసిజ్ సభ్యులను ఉపయోగిస్తుంటారు. ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లో కూడా వీరిని మోహరించారు.
సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినప్పటికీ.. ఇరాన్లో ప్రభుత్వ, సైనిక, మతపరమైన అధికార కేంద్రాలు ఉన్నాయి. ఐఆర్జీసీలోనూ పలువురు కీలక వ్యక్తులు ఉన్నారు. ఈ దళం సభ్యులకు స్వామిభక్తి చాలా ఎక్కువ. కాబట్టి ట్రంప్ హెచ్చరికలకు లొంగడానికి బదులు.. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఐఆర్జీసీ మొగ్గుచూపుతుందనడంలో సందేహం లేదు. ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే.. తాజా పరిణామాలతో ఇరాన్లో ఐఆర్జీసీ ప్రాభవం పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి

















