Khameni Death: ఖమేని పతనం ప్రారంభమైందిలా…?
1989లో ఇరాన్ సుప్రీంనేతగా పగ్గాలు చేపట్టిన అయాతుల్లా ఖమేని.. దశాబ్దాల పాటు తిరుగులేని నేతగా పాలన సాగించారు. పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఓ ప్రాంతీయ శక్తిగా నిలిపారు. అదే సమయంలో దేశాన్ని ఉక్కు పిడికిలితో పాలించారు. తన పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాలను క్రూరంగా అణచివేశారు. హెజ్బొల్లా(HEZ BOLLAHS), హమాస్(HAMAS) లాంటి సంస్థలకు అండగా నిలిచి ప్రాంతీయ అస్థిరతకు దారి తీశారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అలాంటి నేత.. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందనే చెప్పాలి.
రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ ఇరాన్ ఆర్థికంగా నష్టపోతూ వచ్చింది. సహజ వనరులు పుష్కలంగా ఉన్నా.. అమెరికా ఆంక్షల కారణంగా పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ప్రజలకు ఆర్థికంగా అవకాశాలు కల్పించకపోతే మరో విప్లవం వస్తుందని ఖమేనీ అంచనా వేశారు. అందుకే 2015లో అమెరికాతో అణుచర్చలకు పచ్చజెండా ఊపారు. ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో మళ్లీ ఇరాన్ ప్రధాన స్రవంతిలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ 2018లో అధికారంలోకి వచ్చిన ట్రంప్.. అణు ఒప్పందాన్ని రద్దు చేయడంతో ఇరాన్ మళ్లీ ఆంక్షల చట్రంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆర్థికంగానూ, రాజకీయంగా ఆ దేశం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది.

ఖమేనీ పతనానికి బీజం పడిందిలా..!
2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ నిర్వహించిన దాడులే ఖమేనీ పతనానికి దారి తీశాయని చెప్పాలి. ఆ దాడుల తర్వాతే పశ్చిమాసియాలో సమీకరణాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా మారడం ప్రారంభించాయి. ఇజ్రాయెల్ కేవలం గాజాలోని హమాస్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్ నిర్మించిన మొత్తం నెట్‌వర్క్‌పై విరుచుకుపడింది. లెబనాన్‌లో హెజ్బొల్లాలపై యెమెన్‌లో హూతీలపై తీవ్రస్థాయిలో దాడులు చేసింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హత్యచేసి.. ఆ సంస్థను దాదాపు నిర్వీర్యం చేసింది.
ఇరాన్‌కు మద్దతిచ్చే సిరియాలోని అసద్ ప్రభుత్వం 2025 డిసెంబరులో కుప్పకూలడం మరో భారీ దెబ్బ. ఇవన్నీ ఇరాన్‌ను బలహీన పరిచాయి. దీనికి తోడు గతేడాది జూన్‌లో 12 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ దూకుడు..దానికి అమెరికా తోడవ్వడంతో ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. వాటిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు మళ్లీ ఆ రెండు దేశాలు సంయుక్త దాడులు ప్రారంభించి తొలి రోజునే ఖమేనీని హత్య చేశాయి. ఇది రానున్న రోజుల్లో ఇరాన్‌పై, పశ్చిమాసియాపై ఎలాంటి ప్రభావం చూపనుందో చూడాలి.
ఇవి కూడా చదవండి

















