Khameni: ఖమేనీ అంతం వెనక.. ? అమెరికా నిఘా నెట్ వర్క్ కార్యదక్షత…!
నాలుగు దశాబ్దాలకు పైగా తిరుగులేని రీతిలో ఇరాన్ ను శాసించిన సుప్రీంలీడర్ .. అంత సులువుగా ఎలా చనిపోయాడు. గల్ఫ్ దేశాల్లోనే అత్యంత భద్రత కలిగిన ఖమేనీని.. అమెరికా, ఇజ్రాయెల్ ఎలా చంపేశాయి. ఖమేని సురక్షితమని ప్రకటించిన ఇరాన్.. ఆయన భద్రతకు తగిన చర్యలు చేపట్టలేదా..? అసలు ఇరాన్ సుప్రీం లీడర్ షెడ్యూల్.. అమెరికా చేతికి ఎలా వెళ్లింది. అమెరికా ఇచ్చిన సమాచారంతో మొస్సాద్.. ఈ కార్యక్రమాన్ని సూపర్ గా ఎలా విజయవంతం చేసింది.? ఇవన్నీ ఇప్పుడు ప్రపంచదేశాలను వేధిస్తున్న ప్రశ్నలు.
దశాబ్దాల పాటు తిరుగులేని రీతిలో ఇరాన్‌ను శాసించిన అగ్రనాయకుడు ఖమేనీ.. ప్రత్యర్థి దాడిలో అంత సులువుగా ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు దాదాపు ఖాయమని కొద్దిరోజులుగా స్పష్టమవుతున్నా ఆయనను సురక్షితంగా ఉంచడంలో అక్కడి అధికార యంత్రాంగం గట్టి చర్యలు తీసుకోలేదు. అమెరికా నుంచి అందుకున్న ఒక రహస్య సమాచారం ఆధారంగా ఇజ్రాయెల్.. శనివారం మెరుపు వేగంతో స్పందించి దాడికి దిగడంతో తప్పించుకోవడానికి ఖమేనీకి అవకాశం దక్కలేదు. తమ అణు కేంద్రాలను తొలుత లక్ష్యంగా చేసుకోవచ్చని ఇరాన్ నిఘా వర్గాలు భావించాయి. కానీ తొలి దాడి నేరుగా ఖమేనీపైనే జరుగుతుందని ఊహించలేకపోయాయి.
గత ఏడాది ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడికి సన్నద్ధమవుతున్న తరుణంలోనే.. ఖమేనీ ఎక్కడ దాగున్నారో తమకు తెలుసని, కావాలనుకుంటే ఆయనను చంపగలిగి ఉండేవారమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. నాటి నుంచి ఈ పటిష్ట నిఘా నెట్‌వర్క్‌ను అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కొనసాగించింది. గత ఏడాది 12 రోజుల యుద్ధం సమయంలోనే ఖమేనీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ దళం మధ్య కమ్యూనికేషన్ సాగుతున్న తీరు, అత్యవసర సమయాల్లో వారు చేపడుతున్న చర్యల గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంది. ఆ సమాచారం ఆధారంగా తన నిఘా సామర్థ్యానికి సీఐఏ పదును పెట్టింది. తద్వారా.. ఖమేనీ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించడం, తదుపరి అడుగుల గురించి మరింత కచ్చితత్వంతో అంచనాలు వేయగలిగే సత్తాను సాధించింది.
ఇవి కూడా చదవండి
ఇరాన్లో ప్రతి శుక్రవారం ప్రభుత్వ సెలవుదినం. ఖమేనీ ప్రతీ వారం ప్రారంభం రోజున (శనివారం) తన అధికారిక నివాసంలో కీలక ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఖమేనీ అధికారిక నివాసానికి ఎప్పుడెప్పుడు వస్తారు? బంకర్లోకి ఎప్పుడెప్పుడు వెళ్తారు? అనే దానిపై సీఐఏ సమాచారాన్ని సేకరించింది. ఫిబ్రవరి 28న (శనివారం) టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఇరాన్ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమవుతున్నట్లు గుర్తించింది. దీనికి ఖమేనీ కూడా వస్తున్నట్లు తెలుసుకుంది.
ఖమేనీ కదలికలపై అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని సీఐఏ.. ఇజ్రాయెల్‌తో పంచుకుంది. ఆ వెంటనే ఇంటెలిజెన్స్, సైనిక ప్రణాళికపై కసరత్తు మొదలైంది. ఖమేనీ భేటీ శనివారం సాయంత్రం ఉండొచ్చని తొలుత అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భావించాయి. అయితే ఆ సమావేశం ఉదయమే జరుగుతున్నట్లు చివరి నిమిషంలో ఇజ్రాయెల్ నిఘా అధికారులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయమే టెహ్రాన్‌పై విరుచుకుపడాలని నిర్ణయించుకున్నారు. ఖమేనీపై దాడితో యుద్ధాన్ని ప్రారంభించాలని తీర్మానించుకున్నారు. పోరు మొదలయ్యాక ఆయన బంకర్లో తలదాచుకోవచ్చన్న భావనకు అమెరికా, ఇజ్రాయెల్‌లు వచ్చాయి.
ఖమేనీ సమావేశ ప్రాంగణంపై దాడికి శనివారం ఉదయం 6 గంటలకు ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దూసుకెళ్లాయి. వీటిలో అత్యంత కచ్చితత్వంతో కూడిన దీర్ఘశ్రేణి అస్త్రాలు ఉన్నాయి.
ఉదయం 9.40 గంటలకు ఈ జెట్లు టెహ్రాన్‌లోని ప్రభుత్వ ప్రాంగణంపై దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాన్ జాతీయ భద్రతా అధికారులు ఒక భవనంలో.. ఖమేనీ మరో భవనంలో ఉన్నారు. అయినా ఇరాన్ సుప్రీం నేత నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించిన జెట్లు అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాయి.
టెహ్రాన్‌లోని పలు లక్ష్యాలపై కూడా ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో తోమహాక్ క్రూజ్ క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్‌లోని కీలక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఉద్దేశంతో ఈ చర్యకు పూనుకుంది. ఖమేనీ ప్రాంగణం ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు నిర్ధారించాయి. దానిపై 30 బాంబులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఖమేనీపై దాడికి శక్తిమంతమైన ‘బంకర్ బస్టర్’ బాంబులను కూడా వాడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి

















