గాలి జనార్ధనరెడ్డి సంచలన నిర్ణయం
కర్నాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసులో జైలు పాలై ఏడాది క్రితం బయటకు వచ్చిన గాలి జనార్దనరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఆయన స్వయంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరో సంవత్సరంలో కర్నాటకలో ఎన్నికలు జరగనుండడంతో జనార్దనరెడ్డి బరిలోకి దిగుతారని అందరూ భావించారు. బళ్లారి, సింధనూరులో ఏదో ఒక నియోకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అంతలోనే ఈ నిర్ణయం ఆయన అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, జనార్దనరెడ్డి తప్పుకునేది ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాత్రమేనని, తెర వెనుక మాత్రం రాజకీయాలు కొనసాగుతాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల జరిపించిన కుమార్తు పెళ్లితో పలు సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పటికే తనపై చాలా కేసులో ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారని అంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని కొత్త సమస్యలను కొని తెచ్చుకోవడం ఇష్టం లేక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి కూడా అనుభవించానని, ఇక కొత్తగా సాధించేది ఏమీ లేదని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని గాలి సృష్టం చేసినట్టు తెలుస్తోంది.






