సుప్రీంకోర్టులో అద్వానీకి చుక్కెదురు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ సహా పలువురు బీజేపీ సీనియర్ నేతలకు షాకిచ్చింది సుప్రీంకోర్టు. వాళ్లపై క్రిమినల్ కేసులను తిరగదోడటానికి సీబీఐకి అనుమతినిచ్చింది. లక్నో ట్రయల్ కోర్టులో రోజువారీ విచారణకు ఆదేశించింది. అద్వానీ సహా ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి లాంటి నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే లక్షలాది మంది కరసేవకులు మసీదును కూల్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అద్వానీపై ఉన్న క్రిమినల్ కేసులను గతంలో అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. అద్వానీ సహా ఇతర నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో వారిపై మరింత తీవ్రమైన కుట్ర కేసులను నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని సీబీఐ వాదించింది. ఏజెన్సీ వాదనతో కోర్టు ఏకీభవించింది.













