US-IRAN War: ఇరాన్ లో అధికార మార్పిడి సాధ్యమేనా..?
సుప్రీంలీడర్ ఆయాతుల్లా అలీ ఖమేనీని(Khameni) హతమార్చిన అమెరికా-ఇజ్రాయెల్ కూటమి.. ఇంక అధికార మార్పిడిపై ఫోకస్ పెట్టాయి. అయితే ఈపరిణామాలను ఖమేనీ దశాబ్దాల క్రితమే ఊహించారు. అందుకే ఆయన తాను లేకున్నా ఇరాన్ పాలన సాఫీగా సాగేలా… ఏర్పాట్లు చేశారు. పాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొత్త పాలకుడి నియామకానికి తగిన మార్గనిర్దేశకాలు సైతం .. వారికి అందుబాటులో ఉంచారు ఖమేనీ.
నాయకత్వ మండలి(Leadership Council)..!
సుప్రీం లీడర్ లేనప్పుడు ఇరాన్ పాలనా వ్యవహారాలను ముగ్గురు సభ్యులతో కూడిన నాయకత్వ మండలి చూసుకుంటుంది. ఇందులో దేశాధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు మరో సభ్యుడు భాగంగా ఉంటారు. ఖమేనీ మరణంతో ఇప్పటికే ఈ మండలి చేతుల్లోకి ఇరాన్ పాలనా బాధ్యతలు వెళ్లాయి. ఇందులో దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, న్యాయ వ్యవస్థ అధిపతి ఘొలామ్ హొసీన్ మొహ్సెనీ ఎజెహీలకు తోడు తృతీయ సభ్యుడిగా ఆయతుల్లా అలీ రెజా అరాఫీ ప్రస్తుతం ఎంపికయ్యారు.
సుప్రీం లీడర్ నియామకానికి కమిటీ
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికర ప్రశ్న. ఈ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మతపెద్దలతో కూడిన కమిటీ (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్) ఉంటుంది. సుప్రీం లీడర్‌కు ఏమైనా జరిగినప్పుడు వీలైనంత త్వరగా కొత్త అధినాయకుణ్ని నియమించాల్సిన బాధ్యత ఈ కమిటీదేనని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇందులోని సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. గెలిచినవారు 8 ఏళ్లపాటు కమిటీలో ఉంటారు. మెజారిటీ ఓటింగ్ ద్వారా సుప్రీం లీడర్‌ను వీరు ఎన్నుకుంటారు. సుప్రీం లీడర్‌ను తొలగించే అధికారం కూడా ఈ కమిటీకి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ అలాంటి తొలగింపు ఎన్నడూ చోటుచేసుకోలేదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. అప్పుడు సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా ఖొమైనీ నియమితులయ్యారు. 1989లో ఆయన చనిపోయాక.. ఖమేనీకి ఆ పదవి దక్కింది.
ఖమేనీ కుమారుడికి అవకాశం?
ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం.. తదుపరి సుప్రీం లీడర్ ఆయనే అనే ప్రచారం జరిగింది. అయితే 2024 మేలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో ఖమేనీ కుమారులలో ఒకరైన 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ(Mujthaba) ప్రస్తుతం దేశాధినేత అవుతారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుత్వ పదవిని నిర్వహించిన అనుభవమేదీ ముజ్తబాకు లేదు. ఆయన్ను సుప్రీం లీడర్‌గా నియమిస్తే మతపెద్దల కమిటీపై దేశ ప్రజల్లో ఆగ్రహం పెరగొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం మత సిద్ధాంతాలకు విరుద్ధమని కూడా పలువురు చెబుతున్నారు.
రేసులో మరికొెందరు..
అమెరికాకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల అధ్యయన సంస్థ ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఖమేనీకి సన్నిహిత సలహాదారుడైన హుజ్జతుల్ ఇస్లాం మొహ్సేన్ కోమి, ఇరాన్ మతపెద్దల వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న ఆయతుల్లా అలీ రెజా(ali reza) అరాఫీ, మతపెద్దల కమిటీ సీనియర్ సభ్యుడు ఆయతుల్లా మొహ్సేన్ అరాకీ, ఇరాన్ న్యాయ వ్యవస్థ అధిపతి ఘొలామ్ హొసీన్ మొహ్సెనీ ఎజెహీ, మతపెద్దల కమిటీ సభ్యుడు ఆయతుల్లా హషేం హోస్సేని బుషెహ్రి కూడా సుప్రీం లీడర్ పదవి రేసులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి

















