Dhaka: బంగ్లాదేశ్ కు వాస్తవం అర్థమయిందా..? భారత్ తో చర్చలకు ప్రయత్నాలు..!
బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. మొన్నటివరకూ హసీనాను అప్పగించాల్సిందే అంటూ భారత్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చింది బంగ్లాదేశ్. అంతేనా.. పాకిస్తాన్ తో జతకట్టి జుగల్ బందీ ఆలపించింది. తమదేశంలో జరుగుతున్న పరిణామాల వెనక భారత్ పాత్ర ఉందంటూ ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించింది. అయితే వీటన్నింటినీ సాంతం చూస్తూ వచ్చిన భారత్ సైతం.. ఇటీవలి కాలంలో కాస్త గట్టిగానే వ్యవహరించింది. మరీముఖ్యంగా ట్రంప్ తో మోడీ భేటీ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారాయి.
ఎప్పుడైతే యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్(Tulasi gabbard)… భారత్ లో పర్యటించడం…రైసినా డైలాగ్స్ సందర్భంగా బంగ్లాదేశ్ పై ఘాటుగా మాట్లాడడం జరిగిందో.. పొరుగు దేశానికి తత్వం అర్థమైనట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ తో మోడీ భేటీ తర్వాత నుంచే బంగ్లాదేశ్.. భారత్ తో సయోధ్యకు ప్రయత్నిస్తోంది. మరీ ముఖ్యంగా మోడీ..మహమ్మద్ యూనస్‌ల భేటీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏడు దేశాలతో కూడిన ‘బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్’ (బిమ్స్టెక్) కూటమి సమావేశం సందర్భంగా వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే ఢాకాకు చెందిన అధికారులు భారత విదేశాంగశాఖను సంప్రదించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్ హోస్సాని ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘‘బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు ఏర్పాటుచేయడంపై.. ఇప్పటికే భారత్‌తో దౌత్యపరంగా సంప్రదింపులు జరిపాం’’ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయ్‌లాండ్‌లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
2024 సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ విదేశాంగశాఖ సలహాదారు ఎండీ తౌహిద్తో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ చర్చలు జరిపారు. ఈసందర్భంగా ఇరుదేశాల దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకొనే అంశాన్ని ప్రస్తావించారు. నాటినుంచి ఇరుదేశాలు వివిధస్థాయిల్లో అధికారులు చర్చలు జరిపారు. డిసెంబర్ 9వ తేదీన విదేశాంగశాఖ కార్యదర్శులు భేటీ అయ్యారు.
బంగ్లాపై తులసీ కామెంట్స్‌పై స్పందించిన అమెరికా..
బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై ఇటీవల తమ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టమ్మీ బ్రూస్ మాట్లాడుతూ అమెరికా ఎలాంటి హింసనైనా.. మైనార్టీలపై వివక్షను ఖండిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీసుకొన్న చర్యలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని తాము గమనిస్తున్నామని.. భవిష్యత్తులో కూడా ఆ దేశం వాటిని కొనసాగిస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల భారత్ పర్యటన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బంగ్లా పరిస్థితులపై అడిగిన ప్రశ్నకు గబ్బార్డ్ బదులిచ్చారు. ‘బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారీటీలపై దాడులు జరగడం అధ్యక్షుడు ట్రంప్‌నకు, ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే అంశం. దీనిపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో ట్రంప్ చర్చలు ప్రారంభించారు’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె బంగ్లాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాటిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.






