ఆధునిక భారత్ కు బాటలు.. సేవకు ప్రతిరూపం..

టాటా కంపెనీ ఉత్పత్తులు భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి. టాటా సామ్రాజ్యాన్ని రతన్ టాటా రెండు దశాబ్దాల పాటు నడిపించారు. హఠాత్తుగా బీపీ పడిపోవడంతో ఆయనను మూడు రోజుల క్రితం ముంబైలోని బీచ్ కాండి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి రతన్ టాటా చనిపోయారు. అంతకుముందు ఆయన ఆరోగ్యం పై సామాజిక మాధ్యమాలలో రకరకాల ప్రచారాలు జరగడంతో.. రతన్ టాటా స్పందించారు..” నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను బాగానే ఉన్నాను. ఏమాత్రం ఆందోళన చెందకండి అంటూ” ఆయన ప్రకటన చేశారు. అలా ప్రకటన చేసిన మూడు రోజులకే రతన్ టాటా కన్నుమూశారు. రతన్ టాటా.. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జి టాటా కు ముని మనవడు.
రతన్ టాటా …
1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేరు సూనీ టాటా, నావల్ టాటా. రతన్ టాటా పుట్టిన పది సంవత్సరాల తర్వాత సూని, నావల్ ఇద్దరు విడిపోయారు. దీంతో రతన్ టాటా తన నాయనమ్మ నవాజ్ భాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లా ప్రాంతాలలో కొంతకాలం చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అమెరికాలోని రివర్ డేల్ కంట్రీ స్కూల్లో పట్టభద్రుడు అయ్యారు. అనంతరం కార్నర్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను చదివారు.. 1959లో తన విద్యను పూర్తిచేసుకుని.. పట్టా అందుకున్నారు. 2008లో అదే యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా టాటా ఆవిర్భవించారు.
ప్రముఖుల నివాళులు
రతన్ టాటా కన్నుమూయడంతో దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …రతన్ టాటా సేవలను కొనియాడారు.. ” రతన్ టాటా మరణం పూడ్చలేనిది.. ఆయన కన్నుమూత వల్ల భారతదేశం ఒక దార్శనికుడిని కోల్పోయింది. దాతృత్వంలో ఆయన గొప్పగా వ్యవహరించారు. సేవా కార్యక్రమాలలో తనదైన భాగస్వామ్యాన్ని అందించారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడం బాధాకరమని” ద్రౌపది పేర్కొన్నారు. రతన్ టాటా దార్శనికత గొప్పది. ఆయన అత్యంత దయార్ధ హృదయుడు. మానవత్వాన్ని మూర్తిభవించుకున్న మనిషి. అత్యంత అసాధారణ లక్షణాలు ఉన్న మానవుడు. సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన నిరంతరం ప్రయత్నించారని” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.” రతన్ టాటా దార్శనికత చాలా గొప్పది. ఆయన విలువలు పాటించారు. జీవితం చివరి వరకు దేశ క్షేమాన్ని కాంక్షించారని” కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఆధునిక భారత్ కు బాటలు
వ్యాపారం, సేవారంగాల్లో తనదైన ముద్ర వేశారని టాటాను గుర్తు చేసుకున్నారు ముకేష్ అంబానీ. తనకు అత్యంత సన్నిహితుడైన, మంచి స్నేహితుడిని కోల్పోయానన్నారు. తనకే కాదు..దేశానికి టాటా లేని లోటు తీర్చలేనిదన్నారు.“రతన్ టాటా ఆధునిక భారత్ కు మార్గాలను రూపొందించారు. ఆయన వ్యాపారం మాత్రమే కాదు దేశ సమగ్రతను నిలువెల్లా నింపుకున్నారని” ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని వ్యాఖ్యానించారు.
ఆయన సేవకు ప్రతిరూపం
“రతన్ టాటా తో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది. బుధవారమే వారి ఆధ్వర్యంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పదివేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. ఇంతకంటే గొప్పగా దేశం గురించి ఆయనలాగా ఎవరు ఆలోచిస్తారు. ఆయన దర్శనికుడు. సేవా తత్పరుడని” ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.“రతన్ టాటా సేవకు ప్రతిరూపం. వ్యాపార రంగంలో ఆయన విలువలు పాటించారు. సామాజిక సంక్షేమం కోసం పాటుపడ్డారు. దేశ అభివృద్ధికి తాపత్రయపడ్డారు. ఆయన స్ఫూర్తి నిరంతరం వెలుగొందుతుందని” తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.