భారత రత్నం రతన్ టాటా..

భరతజాతి రత్నం రతన్ టాటా.. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న రాకున్నా.. నిస్సందేహంగా భరత జాతి గర్వించదగ్గ రత్నం. దేశం ఆపద ఎదుర్కొంటున్న ప్రతీ సమయంలోనూ దేశపౌరుడిగా తన వంతు సేవ చేశారు. ఈదేశం తనకేమిచ్చిందన్నది ఎప్పుడు చూడని రతన్.. ఈ దేశానికి నేనేమిచ్చానుఅన్నదే ఆలోచించారు. ఆయన పేరు, ప్రఖ్యాతులు ఆశించకున్నా.. ఆయన చేసిన సేవ మాత్రం.. దేశప్రజల్ని ఆలోచింపచేసింది. దేశ ప్రధాని సహా అందరూ.. రతన్ టాటాను.. తమ మనసుల్లో నిలుపుకున్నారు. కాదు లిఖించుకున్నారు దటీజ్ రతన్ టాటా..
భరతజాతి ముద్దుబిడ్డ రతన్…
రతన్ టాటా.. దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లడంలో టాటాల భాగస్వామ్యం అనిర్వచనీయం. ఇప్పుడైతే ఓ అంబానీ, ఓ అదానీ సహా చాలా మంది వ్యాపార వేత్తలున్నారు. కానీ ఆరంభంలో టాటాలు.. దేశాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లారు. మనం తినే ఉప్పు నుంచి తిరిగే విమానాల వరకూ అన్నింటా భాగస్వాములయ్యారు టాటాలు. అందుకే టాటాలు… భరతజాతి ముద్దుబిడ్డలు.
రతన్ టాటా.. దానకర్ణుడే..
రతన్ తాను సంపాదించిన ఆదాయంలో 65% వరకు దాతృత్వ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో ఆయన చూపిన ఉదారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశ సమగ్రత కోసం.. దేశ అభివృద్ధి కోసం.. దేశ ఔన్నత్యం కోసం తన సంపాదన మొత్తం ఖర్చు పెట్టారు. వ్యక్తిగత ప్రయోజనాలను పట్టించుకోకుండా.. పూర్తిగా దేశ సేవ కోసమే రతన్ అంకితమయ్యారు. వ్యాపారంలో విలువలను పాటిస్తూ.. భవిష్యత్తు తరాలు కూడా విలువలు పాటించే విధంగా టాటా గ్రూప్ కంపెనీలను తీర్చిదిద్దారు. అందువల్లే ఆయనకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. 2008లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. ఇంతటి గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ మన దేశ పాలకులు ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం.
ఆయన వ్యాపార దార్శనికతను చూసిన ఇతర దేశాలు అత్యున్నత పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్ విదేశాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను కొనుగోలు చేసి.. నష్టాల్లో ఉన్న వాటి చరిత్రను లాభాల్లోకి మార్చి.. సరికొత్త ఘనత సృష్టించారు రతన్ టాటా. దాదాపు అన్ని కార్యకలాపాల్లోకి టాటా గ్రూపులను విస్తరించి సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించారు. అందువల్లే ధన్యజీవిగా మిగిలిపోయారు.