ప్రజాస్వామ్యానికి జైకొట్టిన కశ్మీరీలు..

జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్య పవనాలు బలంగా వీచాయి. నాడు ప్రజాస్వామ్యం వద్దన్న ప్రజలే.. నేడు పోలింగ్ బూత్ ల దగ్గర బారులు తీరారు. తమ ఓటుహక్కు వినియోగించుకుని.. ప్రజాస్వామ్య ప్రపంచంలో భాగస్వాములయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిని గద్దెనెక్కించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత కశ్మీర్ లో ప్రజాస్వామ్య పవనాలు వీయడం.. ప్రజాస్వామ్య ప్రేమికులకు ఆనందం కలిగించిందని చెప్పవచ్చు. మరోవైపు.. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ప్రజాస్వామ్యప్రభుత్వం ఏర్పడడం మాత్రం.. కేంద్రం పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఆర్టికల్ 370 చుట్టూ కశ్మీర్ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 370 రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని.. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఈవాదనకు దూరంగా ఉంది. ఇక .. గతంలో చక్రం తిప్పిన పీడీపీ.. ఇప్పుడు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తిన్నట్లైంది. ఇక కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్రహోదా కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చినా.. కశ్మీరీలు మాత్రం కూటమికే పట్టం గట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం శాయసక్తులా కృషి చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం పలుమార్లు ఆపరేషన్లు నిర్వహించింది.
ఎప్పుడు ఎన్నికలు బహిష్కరించే జమాతేలాంటి సంస్థలు సైతం.. ఈసారి పెద్దగా స్పందించలేదు. ఇక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రాంతాల్లో ప్రజలు సైతం పెద్దసంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూలో హిందువులప్రాబల్యం అధికం కాగా.. కశ్మీర్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. గతంలోలాగే జమ్మూలో బీజేపీ తన ఆధిక్యతను ప్రదర్శించింది. కాంగ్రెస్ మాత్రం ఒక్కస్థానంలో విజయం సాధించింది. ఇక కశ్మీర్ లో మాత్రం ఎన్సీ కూటమి తన ప్రాభవాన్ని చాటింది. అత్యధిక సీట్లు సాధించి విజయబావుటా ఎగురవేసింది. అధికార పగ్గాలు చేపట్టే దిశగా అడుగులేస్తోంది.