Trump: చివరి క్షణంలో చర్చలకు సిద్ధమన్నారు.. ఇరాన్ నేతల తీరుపై ట్రంప్..!
తాను పదేపదే చర్చిద్దామన్నానని… దానికి ఇరాన్ అధినాయకత్వం సరిగ్గా స్పందించలేదన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు.. దాడులు మొదలవుతున్న తరుణంలో చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేశారని.. అయితే అప్పటికే చర్చల సమయం ముగిసిపోయిందని చెప్పానన్నారు ట్రంప్. దీంతో తమదళాలు.. ఇరాన్ వైపు దూసుకుపోయాయని తెలిపారు. ఇరాన్ (Iran) నాయకత్వంతోపాటు ఆ దేశ గగనతల రక్షణ, వాయుసేన, నౌకాదళ వ్యవస్థలన్నీ తుడుచు పెట్టుకుపోయినట్టు తెలిపారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమవద్ద లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని పోస్టు పెట్టారు. విజయవంతంగా ఎప్పటికీ యుద్ధం చేస్తూనే ఉండగలమని రాసుకొచ్చారు. అమెరికా కోసం ఉన్నతశ్రేణి ఆయుధాలను ఇతర దేశాల్లో కూడా నిల్వ చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(BIDEN) పై విమర్శలు గుప్పించారు. ఆయన ఆయుధాల నిల్వలను సరిగా నిర్వహించలేదని, ఉక్రెయిన్‌కు భారీఎత్తున అధునాతన ఆయుధాలను పంపారని విమర్శించారు. ‘‘అదృష్టవశాత్తూ తన తొలివిడత పాలనలోనే మిలిటరీని మెరుగుపర్చానన్నారు ట్రంప్. అమెరికా వద్ద నిల్వలు భారీ విజయాలు సాధించేంతగా ఉన్నాయి’’ అని తన పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్‌పై దాడుల గురించి కాంగ్రెస్ (అమెరికా చట్టసభలు)కు ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు అధ్యక్షుడు సమర్థించుకున్నారు. అలాగే రానున్న 24 గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేయనున్నట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము ఇప్పటివరకు పెద్ద దాడులే చేయలేదని వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది.
వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన ఓ కథనాన్ని ట్రంప్ ఖండించారు. ఆ పత్రిక అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్నారు. అమెరికా ఆయుధ నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే అవి నిండుకునే ప్రమాదం ఉందన్న వార్తలను అధ్యక్షుడు తోసిపుచ్చారు. మధ్యస్థ, ఉన్నతస్థాయి ఆయుధాలు అపరిమిత సంఖ్యలో ఉన్నాయని, అవి చాలా శక్తిమంతమైనవన్నారు.
ఇవి కూడా చదవండి

















