ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు కమలానికి పరీక్షేనా..?

హర్యానా విజయం బీజేపీలో ఉత్సాహకరమైన వాతావరణం నింపింది. అస్సలు గెలిచేప్రసక్తే లేదని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించినా.. నిరాశపడకుండా లక్ష్యాన్ని సాదించింది. హ్యాటిక్ సాధించి.. హర్యానాలో తిరుగులేదనిపించింది. అయితే ఇక్కడితో అయిపోలేదు. ముందుంది ముసళ్ల పండుగ అన్న పరిస్థితి. ఎందుకంటే… దేశంలో కీలక రాష్ట్రాలైన ఢిల్లీ, మహారాష్ట్ర జార్ఘండ్, బిహార్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు.. కాషాయపార్టీకి గట్టి పరీక్షగా నిలుస్తాయంటున్నారు రాజకీయ నిపుణులు.
ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రాల్లో బిజెపి .. పలురకాలుగా రాజకీయ క్రీడలు ఆడేసింది.తమకున్న బలానికి మించి మిగతా రాజకీయ పార్టీలతో ఒక ఆట ఆడుకుంది.అయితే.. ఆ క్రీడలు ప్రజల్లోకి సైతం బలంగా వెళ్లాయని చెప్పక తప్పదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అంత ఈజీ కాదు. అందుకే ఆందోళన చెందుతోంది భారతీయ జనతా పార్టీ. ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కూడా. వాటిని అధిగమించి బిజెపి మంచి ఫలితాలు సాధించడం అంటే ఆశామాషి కాదు.
నితీష్ తో ఈజీ కాదు..
* బీహార్లో అయితే నితీష్ తరచూ కూటమిలను మార్చారు.ఆర్జెడితో జత కట్టిన ఆయన కొద్ది రోజులకే ఆ పార్టీ నుంచి దూరమయ్యారు.మళ్లీ బిజెపికి చేరువ అయ్యారు.అయితే మరోసారి బిజెపికి హ్యాండిచ్చి ఆర్జెడితో చేతులు కలిపారు. అది కూడా మూన్నాళ్ళ ముచ్చటగా ఉంది. ఇప్పుడు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో ఆయన కలిసి వెళ్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకమే.
హస్తిన అందేనా…?
* ఢిల్లీలో బిజెపి అధికారం చేపట్టి చాలా రోజులు అవుతోంది. అమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రాలేదు. పైగా ఆప్ పంజాబ్లో సైతం పాగా వేసింది. సరిగ్గా ఎన్నికల ముంగిట ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. బిజెపి చేసిన పనని అనువుగా మార్చుకుంటున్న కేజ్రీవాల్..రాజకీయంగా భారీ స్కెచ్ వేశారు. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అదే పార్టీకి చెందిన వ్యక్తిని నియమించారు. ఇక్కడ కేజ్రీవాల్ ను ఆపే శక్తి బీజేపీకి ఉందా అన్నది ప్రశ్నగా మారింది.
మరాఠా పాలిటిక్స్…
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆడిన వైకుంఠపాళీ అక్కడ ప్రజల్ని భాగా ప్రభావితం చేసింది. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. శివసేన, ఎన్సీపీని టార్గెట్ చేసుకుని బిజెపి ఆడిన గేమ్ అక్కడ ప్రజలను సైతం నివ్వెరపరిచింది. అక్కడ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
జార్కండ్ లో పాగా వేసేది ఎలా..?
జార్ఖండ్ లో సైతం ప్రాంతీయ పార్టీలతో ఒక గేమ్ ఆడింది బిజెపి.కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడింది. దీంతో అక్కడి ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు.. బీజేపీకి ఆమడదూరంలో ఉంటున్నాయి.అక్కడ కూడా ఏమంత పరిస్థితి ఆశాజనకంగా లేదని టాక్. ఈ నాలుగు రాష్ట్రాల్లో బిజెపి నెగ్గుకు రాకపోతే.. మోడీ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్టయినట్లే అంటున్నారు రాజకీయ పండితులు.