AI Summit: ఢిల్లీ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన!
దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ (AI Summit) వేదికగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా నిరసనకు దిగారు. సదస్సు జరుగుతున్న ప్రాంగణం వెలుపల కొందరు కార్యకర్తలు తమ చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ నేతలు హాజరైన ఈ సదస్సు వద్ద భద్రతా లోపాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది.
పక్కా ప్లాన్‌తోనే..
అత్యంత పటిష్టమైన భద్రత ఉండే సమ్మిట్ (AI Summit) ప్రాంగణంలోకి నిరసనకారులు ఎలా వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీశారు. వారు ముందుగానే క్యూఆర్ కోడ్లను (QR Codes) సేకరించి, పక్కా ప్రణాళికతో లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఆందోళనల్లో పాల్గొన్న నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సదస్సు వద్ద ఉన్న అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ (Facial Recognition) టెక్నాలజీ ద్వారా మిగతా వారిని గుర్తించి, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
రాజకీయ యుద్ధం..
ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. దేశం సాంకేతిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ ఇలాంటి చర్యలతో దేశ ప్రతిష్ఠను మంటగలుపుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిపై అసూయ పెరిగిందని బీజేపీ ప్రతినిధి నలిన్ కోహ్లీ విమర్శించారు. టెక్నాలజీ రంగంలో దేశం ముందడుగు వేయాలంటే అందరూ సహకరించాలని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు.
సమ్మిట్ (AI Summit) వద్ద యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనలకు నిరసనగా, బీజేపీ యువజన విభాగం కార్యకర్తలు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వద్ద ఆందోళనలు చేపట్టారు. ఒకవైపు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, మరోవైపు రాజకీయ నిరసనలతో ఢిల్లీలో పొలిటికల్ సెగ రాజుకుంది. ప్రపంచ దేశాల ప్రతినిధులు ఉన్న సమయంలో ఈ నిరసనలు జరగడం భద్రతా వ్యవస్థలకు సవాలుగా మారింది.
ఇవి కూడా చదవండి

















