Vande Bharat 4.0: త్వరలోనే వందేభారత్ 4.0 ట్రైన్ విడుదల: అశ్వినీ వైష్ణవ్

భారతీయ రైల్వేల రూపురేఖలు మారనున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలను చేరుకునే లక్ష్యంతో, రైల్వేల ఆధునీకరణకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలో వందే భారత్ 4.0 (Vande Bharat 4.0) రైలును ఆవిష్కరించనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెక్స్ట్ జనరేషన్ మోడల్ రైలు పూర్తిగా ప్రపంచ స్థాయి సాంకేతికతతో రూపొందుతోందని, దీనిని సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
వందే భారత్ 4.0 తో పాటు, కేంద్రం మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని కూడా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రధాన రైల్వే మార్గాల్లో గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే హై-స్పీడ్ ప్యాసింజర్ రైలు (Vande Bharat 4.0) కారిడార్‌లను అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోందని వెల్లడించారు. దీని ద్వారా ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనేదే తమ లక్ష్యమన్నారు. భారతీయ రైల్వేలు ప్రస్తుతం ఏటా 7,000 కోచ్‌లు, 1,681 లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేస్తూ అపూర్వమైన వృద్ధిని సాధిస్తున్నాయని, ఈ ప్రణాళికలు దేశ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నాయని మంత్రి (Ashwini Vaishnaw) వెల్లడించారు.