Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ: క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం

వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇండియన్ క్రికెట్ (Indian cricket) కు మరో ఆణిముత్యం దొరికాడని అందరూ సంబరపడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ చరిత్ర తిరగరాస్తున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్ (samasthipur) సమీపంలోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామంలో 2011 మార్చి 27న జన్మించిన వైభవ్ సూర్యవంశీ, కేవలం 14 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టించాడు. ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడిగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరపున ఆడుతున్నారు. తొలి బంతికే సిక్సర్ కొట్టి, 35 బంతుల్లో సెంచరీ సాధించి రికార్డులను తిరగరాసాడు. వైభవ్ ఆటతీరు కేవలం అతని ప్రతిభను మాత్రమే కాదు, అతని నిర్భయ స్ఫూర్తిని, సంకల్పాన్ని కూడా ప్రపంచానికి చాటింది.
వైభవ్ క్రికెట్ ప్రస్థానం అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ (Sanjiv Surya Vamsi) మార్గదర్శనంతో తొమ్మిదేళ్ల వయసులో ప్రారంభమైంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, వైభవ్ క్రికెట్ కలలను సాకారం చేయడానికి సంజీవ్ తన భూమిని అమ్మేశాడు. ఆయన త్యాగం ఫలించింది. 2024లో వైభవ్ రంజీ ట్రోఫీలో (Ranji Trophy) బీహార్ తరపున 12 ఏళ్ల వయసులో తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు. రెండో అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అదే ఏడాది అండర్-19 టెస్టులో (Under 19) ఆస్ట్రేలియాపై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ 2025 (IPL) వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) నేతృత్వంలో అతను జట్టులో చేరాడు. జైపూర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టి అభిమానులను ఉర్రూతలూగించాడు. 20 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. ఆ తర్వాత నిన్న గుజరాత్ టైటాన్స్ పై (Gujarat Titans) 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర తిరగరాశాడు. రషీద్ ఖాన్ వంటి వరల్డ్-క్లాస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు.
వైభవ్ ఆటలో ధైర్యం, పొగరు, తెగువ కనిపిస్తున్నాయి. అతను బౌలర్లను ఎదుర్కొనే తీరు, ఒత్తిడిలోనూ చలనం లేని మనస్తత్వం అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. సెంచరీ సాధించిన తర్వాత కేవలం చిరునవ్వుతో, బ్యాటుతో సెల్యూట్ చేసి, అతను తన సంబరాలను సింపుల్ గా కానిచ్చేశాడు. ఈ సింప్లిసిటీ అతని లక్ష్యం ఇది కాదని.. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని తెలియజేస్తోంది. తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని సూచిస్తుంది.
సమస్తిపూర్ గల్లీల నుంచి ఐపీఎల్ వేదికల వరకు వైభవ్ ప్రయాణం యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. అతని విజయాలు బీహార్‌కు గర్వకారణం. భారత క్రికెట్ భవిష్యత్తుకు ఆశాకిరణం. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు సృష్టించిన రికార్డుల సరసన వైభవ్ పేరు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వైభవ్ కథ కేవలం పరుగులు, సిక్సర్ల గురించి మాత్రమే కాదు. అతని సంకల్పం, త్యాగం, నిర్భయత్వం గురించి కూడా తెలియజేస్తోంది. అతను హెల్మెట్ తీసినప్పుడు.. చెమట లేని ముఖంతో నవ్వినప్పుడు.. అతను చెప్పకనే చెప్పాడు.. “ఇది ఆరంభం మాత్రమే.., చరిత్ర కొత్త పేజీలు ఇంకా రాయాలి.” అని.! శభాష్, వైభవ్—నీ స్ఫూర్తి ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది!